మదనపల్లె టౌన్ : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు గాయపడి మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బి కొత్తకోటకు చెందిన ఖాదర్ బాషా ఇంటి ముందు నడిచి వెళుతుండగా గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో కాలు విరిగి తీవ్రంగా గాయపడిన అతన్ని కుటుంబీకులు వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే రంగసముద్రంలో కాపురం ఉంటున్న నాగార్జున(37) సొంత పనిమీద శుక్రవారం బి.కొత్తకోటకు వచ్చి తిరిగి బైక్‌పై ఇంటికి వెళుతుండగా, ఆటో బైకును ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని స్థానికుల సాయంతో 108 సిబ్బంది మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. కేసు దర్యాప్తులో ఉందని బి.కొత్తకోట సీఐ గోపాల్‌రెడ్డి తెలిపారు.
స్కూటర్ ఢీకొని..
స్కూటర్ ఢీకొని లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డ సంఘటన శనివారం కలకడ మండలంలో జరిగింది. బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. కలకడ మండలం నడిమిచెర్లకు చెందిన అజంతుల్లా కుమారుడు జాఫర్ బాషా(40) గుర్రంకొండకు చెందిన ఓ యజమాని దగ్గర లారీకి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. విధులకు వెళ్లేందుకు రోడ్డుపైకి వచ్చిన జాఫర్‌ను ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాధితున్ని స్థానికులు వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి, కలకడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడికి ఆసుపత్రి అత్యవసర విభాగం డాక్టర్లు వైద్య చికిత్సలు అందించి తిరుపతి రుయాకు వెళ్లాలని సూచించారు. కలకడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


