● మూడో నెల కావస్తున్నా అందని వేతనాలు
పెద్దతిప్పసముద్రం: అసలే చాలీ, చాలని వేతనాలు. అవి కూడా ప్రతి నెలా సక్రమంగా మంజూరు కావు. నెలల తరబడి జీతాలను మంజూరు చేయకుండా కాలయాపన చేస్తే తమ జీవనం ఎలా గడుస్తుందని పలువురు చిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ)లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పని చేస్తున్న సిబ్బందికి జూన్, జూలై నెలకు సంబంధించి ఇంత వరకు జీతాలు అందలేదు. జీతాలు రానందున చిరుద్యోగుల ఇంటి అద్దెలు, నిత్యావసర సరుకులు, పిల్లల ఫీజులు, ఈఎంఐలు సకాలంలో చెల్లించలేని పరిస్థితి. ద్విచక్ర వాహనాల్లో ఇంధనం కోసం ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడో నెల కావస్తున్నా కూడా జీతాలు రాకుంటే పూట గడిచేది ఎలా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న రెండు నెలల జీతాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కాంట్రాక్ట్ ఉద్యోగుల యూనియన్ నాయకులు పాలకులకు, అధికారులకు విన్నవించినా ఇంత వరకు అతీగతీ లేకుండా పోయిందని పలువురు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. జీతాల మంజూరు విషయంపై సమగ్ర శిక్ష అధికారులను వివరణ కోరగా త్వరలోనే జమ అవుతాయని చెబుతున్నారు.
జిల్లాలో కాంట్రాక్ట్ ఉద్యోగులు
అన్నమయ్య జిల్లాలోని 25 మండలాల్లో కస్తూర్బా బాలికా విద్యాలయం, ఎంఈఓ కార్యాలయం, భవిత కేంద్రాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పని చేసే వారు 262 మంది ఉన్నారు. వీరిలో ఉద్యోగ స్థాయిని బట్టి ఒక్కొక్కరికి కేవలం రూ.17 వేల నుంచి రూ.27 వేల వరకు జీతాలు మంజూరు అవుతాయి. వీరిలో జిల్లా వ్యాప్తంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లు 25 మంది, మండల ఇన్ఫర్మేషన్ సిస్టం (ఎంఐఎస్) కోఆర్డినేటర్లు 22 మంది, ఎంఆర్‌సీకి అనుభంధంగా ఉన్న సీఆర్‌పీలు 130 మంది, మెసెంజర్లు 28 మంది, భవిత సెంటర్ టీచర్లు 57 మంది ఉన్నారు.


