● మాజీ మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, మదనపల్లె: అక్రమాల విషయంలో బీజేపీ ద్వందనీతి ప్రదర్శిస్తూ కేంద్రానికి ఒక న్యాయం, రాష్ట్రానికి ఒక న్యాయంగా వ్యవహరించడం తగదని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ పార్టీని ప్రశ్నించారు. శనివారం అన్నమయ్యజిల్లా తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాల్లో జరుగుతున్న నిరాహర దీక్షల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీట్ లీకేజీ గురించి ఆరోపణలు వస్తే బీజేపీ బాధ్యత తీసుకుని కేంద్రమంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించారన్నారు. రాష్ట్రంలో జరిగిన డీఎస్సీ నియామకాల్లో మంత్రి లోకేష్‌ను అయ్యా డబ్బు తీసుకుని సగం ఉద్యోగాలను అమ్ముకున్నావు దీనికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుంటే అబ్బేబే నేను ఎందుకు చేస్తాను, నేనేం తప్పు చేయలేదని తప్పించుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో కూటమిగా బీజేపీ అధికారంలో ఉంది, కూటమి ప్రభుత్వంలోని టిడిపి డీఎస్సీ నియామకాల్లో అక్రమాలకు పాల్బడుతుంటే బీజేపీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఒకే అంశంపై బీజేపీ కేంద్రంలో మంత్రికి ఒక న్యాయం,రాష్ట్రంలో లోకేష్‌కు ఒక న్యాయంగా వ్యవరించడం సబబుగాలేదన్నారు. జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమరనాధరెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ పేరుతో అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టి పేద అభ్యర్థులకు తీరని అన్యాయం చేశారని నిలదీశారు. ఈ అక్రమాలపై నిరుద్యోగ యువత తీవ్ర ఆగ్రహంతో ఉందన్నారు. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలన్నారు, ఇచ్చారా, నిరుద్యోగ భృతి రూ.3 వేలన్నారు, ఇచ్చారా, ఇలాంటి మోసాకారి హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నిరుద్యోగుల అగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.


