గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లికి ఆషాఢమాస చీరెసారె సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం జిల్లా సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు శ్రీ రెడ్డెమ్మకొండకు చేరుకొన్నారు. ప్రతి ఏటా ఈ సంస్థ ఆధ్వర్యంలో ఆషాఢమాసంలో అమ్మవారికి చీరెసారె సమర్పించడం ఆనవాయితీగా వస్తొంది. ఈనేపథ్యంలో స్థానిక దద్దాలవారిపల్లె నుంచి అమ్మవారి ఆలయం వరకు చెక్కభజనల నడుమ ఊరేగింపుగా చీరసారెను తీసుకొచ్చారు. మహిళలు వాటిని అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకొన్నారు. ఆలయప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు ఆధ్యాత్మిక గురువులు తమ ఉపదేశాలు, ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయకమిటీ ఛైర్మన్ రాజన్న నాయడు, ఈవోమంజులు, జిల్లా సమరసతా సేవా ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గోన్నారు.
మాజీ ఎమ్మెల్యే కుటుంబాన్ని వేధిస్తే ఊరుకోం
పుంగనూరు : రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీ నాయకులపై పథకం ప్రకారం అక్రమ కేసులు బనాయించి, అరెస్ట్ చేయడం, వేధించడం చేస్తే చూస్తూ ఊరుకోబోమని వైఎస్సార్‌సీపీ సీమ జిల్లాల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఫకృద్ధిన్ షరీఫ్, హజ్ కమిటీ మాజీ డైరెక్టర్ ఖాదర్ హెచ్చరించారు. శుక్రవారం విలేకరులతో వారు మాట్లాడారు. గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన తనయుడు ముబషీర్‌లపై తప్పుడు కిడ్నాప్ కేసులు బనాయించి, నూజివీడు పోలీసులు అరెస్ట్ చేయడం బాధాకరమన్నారు. అక్రమ కేసులకు వైఎస్సార్‌సీపీ నాయకులు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. ముస్తఫా కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ముస్తఫా కుటుంబంపై పెట్టిన తప్పుడు కేసులు ఉపసంహరించుకుని, తండ్రి, తనయులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.


