రొంపిచెర్ల: రొంపిచెర్ల గ్రామ పంచాయతీలోని గాండ్లవీధిలోని ఒక ఇంట్లో గురువారం రాత్రి దొంగలు పడి బంగారు నగలను దోచుకెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి. గాండ్లవీధికి చెందిన జరీనా భర్త బాదుల్లా కువైట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పది సంవత్సరాల క్రితం మృతి చెందాడు. దీంతో బతుకు దెరువు కోసం తన కుమారుడు మహమ్మద్‌తో కలిసి సంవత్సరం క్రితం కువైట్‌కు వెళ్లింది. కువైట్‌కు వెళ్లే సమయంలో బంగారు నగలను బ్యాంక్‌లో తాకట్టు పెట్టింది. తర్వాత మూడు నెలలకు కుమారుడు మహమ్మద్ ఇండియాకు వచ్చి బంగారు నగలను విడిపించి ఇంట్లో బీరువాలో పెట్టి తిరిగి కువైట్‌కు వెళ్లాడు. తర్వాత పీలేరులో ఉన్న కుమారై 15 రోజులకు ఒక సారీ పీలేరు నుంచి రొంపిచెర్లకు వచ్చి ఇళ్లు చూసుకుని వెళ్లేది. అయితే శుక్రవారం ఇంటి ముందర చెత్త తోయడానికి వచ్చిన అమ్మమ్మకు తలుపులు పగులగొట్టి ఇంట్లో చోరీ చేసినట్లు చూసి పక్కన ఉన్న వారికి సమాచారం ఇచ్చింది. దీంతో రిజ్వాన రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. 151 గ్రాముల బంగారు నగలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. బంగారు నగల విలువ సుమారు రూ.25 లక్షలు ఉంటుందన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం చిత్తూరులోని వేలిముద్రల నిపుణులను రొంపిచెర్లకు రప్పించి వేలిముద్రలను సేకరించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మధుసూదన్ తెలిపారు.


