సాక్షి, మదనపల్లె : డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలని.. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని యువత డిమాండ్ చేసింది. ఈ మేరకు ఊరూరా ఉద్యమబాట పట్టింది. గురువారం వైఎస్సార్‌సీపీ జిల్లాలో చేపట్టిన నిరాహార దీక్షలకు మద్దతుగా విద్యార్థి, యువజనులు తరలివచ్చారు. అక్రమాలను ఇంకెన్నాళ్లు దాచి పెడ్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కష్టాన్ని మరొకరు దోచుకున్నారని ప్రశ్నిస్తే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బాధిత డీఎస్సీ అభ్యర్థులకు అండగా, మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు ఆ పార్టీ నేతలు నియోజకవర్గ స్థాయిలో చేపట్టిన తొలి రోజు నిరాహార దీక్షలు విజయవంతమయ్యాయి.
తొలిరోజు ఇలా..
డీఎస్సీ అక్రమాలపై చర్యలను కోరుతూ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరాహార దీక్షలను ప్రారంభించింది. తొలిరోజు నిరాహార దీక్ష విజయవంతంగా సాగింది. ర్యాలీలతో ఆయా నియోజకర్గ కేంద్రాల్లో నిరాహార దీక్షలు మొదలవగా పార్టీ శ్రేణులు హజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోకేష్ రాజీనామా చేయాలి, సీబీఐ విచారణ జరపాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ దీక్షలు ఆదివారం వరకు నాలుగురోజులపాటు కొనసాగుతాయి. కాగా మదనపల్లెలో తొలుత చిత్తూరు బస్టాండ్‌లో దీక్షలు చేసేందుకు నిర్ణయించగా అనుమతి లేదని పోలీసులు నిరాకరించారు. దాంతో పార్టీ కార్యాలయం వద్ద దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలకు సంఘాలు, విద్యార్థి, యువజనులు, ప్రజలు మద్దతు తెలిపారు.
పుంగనూరు : పుంగనూరులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే, రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎంబీటీ రోడ్డు నుంచి ఇందిరా సర్కిల్ వరకు ర్యాలీ జరిగింది. ఇందిరా సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన నిరాహార దీక్ష శిబిరాన్ని పెద్దిరెడ్డి ప్రారంభించి, స్థానిక నేతలతో కలిసి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ లోకేష్ రాజీనామా చేసి నైతికత నిరూపించుకోవాలన్నారు. అక్రమాలపై సీబీఐ విచారణ జరిపి అక్రమాల నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ రెడ్డప్ప, రాయలసీమ మైనార్టీ విభాగం ఇంచార్జ్ ఫక్రుద్దీన్ షరీఫ్, ఎంపీపీ భాస్కర్ రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కొత్తపల్లి చెంగారెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి హేమంత్ కుమార్ రెడ్డి, వక్ఫ్ బోర్డు జిల్లా మాజీ అధ్యక్షులు అమ్ము పాల్గొన్నారు.
రాయచోటి : రాయచోటిలో నేతాజీ సర్కిల్లో స్థానిక నేతలు నిరాహారదీక్ష ప్రారంభించారు. మాజీ ఎమ్మె ల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఫయాజ్ బాషా, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కిషోర్ దాస్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రెడ్డి కుమార్, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు అంజనప్ప పాల్గొన్నారు.
తంబళ్లపల్లె : తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోటలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాఽథరెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభమయ్యాయి. వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పాగొండ ఖలీల్, ఎంపీపీ మొహమూద్, మండల అధ్యక్షులు ఎన్.ప్రదీప్‌రెడ్డి పాల్గొనగా సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మనోహర్‌రెడ్డి, నాయకులు మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్నారు.
డీఎస్సీ స్కాంపై ‘దీక్షా’స్త్రం
జిల్లాలో ప్రారంభమైన వైఎస్సార్‌సీపీ నిరాహార దీక్షలు
తరలివచ్చిన విద్యార్థులు, యువకులు
లోకేష్ రాజీనామా, సీబీఐ విచారణకు డిమాండ్
పుంగనూరు దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి


