మదనపల్లె టౌన్ : మదనపల్లెను జిడ్డు కృష్ణమూర్తి జిల్లాగా మార్చాలి. అన్నమయ్యను కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఐ జాతీయ నాయకులు నారాయణ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ వరకు చేపట్టిన పాదయాత్ర గురువారం జిల్లా కేంద్రం మదనపల్లె, ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ప్రారంభించారు. ఈ ర్యాలీ బెంగళూరు బస్టాండ్ మీదుగా చిత్తూరు బస్టాండ్ వరకు సాగింది. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాలైన ఉద్యోగ, ఉపాధి కల్పించకపొగా, నిత్యావసరాలకు రేట్లు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగులకు ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తానన్న మాట మరచి ఉన్న ఉద్యోగాలు తొలగించి ఇళ్లకు పంపిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ మోదీకి భజన తప్పితే ప్రశ్నించడం లేదన్నారు. మదనపల్లెకు అన్నమయ్య పేరుపెట్టడం సబబు కాదని జిడ్డు కృష్ణమూర్తి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రామానాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న ఇంత వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందిందన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయడం దుర్మార్గమని ప్రభుత్వమే వైద్య విద్యను అందించాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలన్నారు.బీటీ కళాశాలను యూనివర్సిటీగా మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మహేష్, తోపు కృష్ణప్ప, కార్యవర్గ సభ్యులు సాంబశివ, నియోజకవర్గ కార్యదర్శి కే.మురళి, నాయకులు రెడ్డిశేఖర్, నరేష్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి కే.మాధవ్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు విజయన్, డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి హరి, తిరుమల, దేవా, సురేష్, బాలు, భార్గవి, నవ్య, రెడ్డప్ప కార్యకర్తలు పాల్గొన్నారు.
సీపీఐ జాతీయ నాయకులు నారాయణ


