రామసముద్రం : ఎల్‌నినో ప్రభావం, తీవ్ర వర్షాభావంతో రామసముద్రం మండలంలో పంటలు ఎండుముఖం పడుతుండటంపై వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం కలికిరి వ్యవసాయ విజ్ఞాన కేంద్రం (కేవీకే) సీనియర్ శాస్త్రవేత్త, హెడ్ డాక్టర్ కె. మంజుల నేతృత్వంలోని బృంద సభ్యులు మండలంలోని కె.సి.పల్లి, మినికి, గుంతయంబాడి, వనగానిపల్లి గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, ప్రస్తుత పరిస్థితుల్లో అనుసరించాల్సిన సాగు విధానాలపై పలు సూచనలు చేశారు. బోరుబావుల కింద ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇస్తూ, తోటల్లో మల్చింగ్ వాడకంతో నేలలో తేమ ఎక్కువకాలం నిల్వ ఉండి నేల సారం కూడా పెరుగుతుందన్నారు. పొలాల వద్ద గుంతలు, చిన్న కాలువలు ఏర్పాటు చేసి వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలని, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాల నుంచి రక్షణ పొందేందుకు రైతులు పంట బీమా చేయించుకోవాలని సూచించారు. శాస్త్రవేత్తలు ఠాగూర్, సహజదేవి, బి. సంతోష్ సోమశేఖర బాబు పాల్గొన్నారు.


