పెద్దతిప్పసముద్రం: మండలంలోని దూలంవారిపల్లి సమీపంలో పేకాట సాగుతోందని పలువురు గురువారం ఎస్‌ఐ పరమేష్ నాయక్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో ఎస్‌ఐ సిబ్బందితో కలసి పేకాట స్థావరంపై దాడులు నిర్వహించారు. 9 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.6,600 నగదు, 9 సెల్‌ఫోన్లు, ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
రైలు కింద పడి వ్యక్తి మృతి
పీలేరురూరల్ : రైలు కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని దొడ్డిపల్లె పంచాయతీ ఫిరోజ్ ఫంక్షన్ హాల్ సమీపంలో చోటు చేసుకుంది. మండలంలోని తలపుల పంచాయతీ మేకలవారిపల్లెకు చెందిన రెడ్డెప్ప (65) నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి కనపడలేదు. గురువారం మధ్యాహం్న గుంతకల్లు – తిరుపతి ప్యాసింజర్ రైలు కింద మృతి చెందాడు. స్థానికులమేరకు రైల్వే అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తుతెలియని వాహనం
ఢీ కొని కృష్ణజింక మృతి
ములకలచెరువు: గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో కృష్ణ జింక మృతిచెందిన సంఘటన గురువారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, ఫారెస్టు భీటు అధికారి శ్రీనివాసులు కథనం మేరకు... మండలంలోని కదిరినాథునికోట క్రాస్ జాతీయ రహదారిపై జింకల మంద రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో జింక మృత్యువాతపడింది. అనంతరం అక్కడే ఉన్న కుక్కలు జింక కళేబరాన్ని పీక్కుతింటుండగా స్థానికులు గమనించి ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. జింకను స్వాధీనం చేసుకున్న వారు సండ్రడవిలో ఖననం చేశారు.
అట్రాసిటీ కేసుపై విచారణ
రామసముద్రం: మండలంలోని ఎరపశెట్టిపల్లి గ్రామంలో ఇటీవల నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై గురువారం డీఎస్పీ బుచ్చిబాబు విచారణ చేపట్టారు. కేసుకు సంబంధించిన బాధితులు, గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించి, సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, కేసును అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా విచారించి, వాస్తవాలను నిర్ధారించిన అనంతరం చట్టప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


