● ప్రభుత్వ ధర బస్తా రూ. 270 ఉండగా రూ. 350 వరకు విక్రయం
● రైతుల ఫిర్యాదుపై స్పందించిన
అగ్రికల్చర్ అధికారులు
● ఏపీ ఆగ్రోస్ రైతు సేవాకేంద్రం
లైసెన్సు రద్దు, గోదామ్ సీజ్
రాయచోటి: వ్యవసాయ సాగుకు అవసరమైన ఎరువులు, మందుల విక్రయాలలో వ్యాపారుల దోపిడీ సాగుతోంది. ఫలితంగా ఆరుగాలం కష్టపడుతన్న రైతులకు ఎరువుల దుకాణాదారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వ్యవసాయ అధికారులు సైతం అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టకపోవడంతో చెప్పిన ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రైవేటు వ్యాపారుల నుంచి రైతులకు విముక్తి కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆగ్రోస్ సంస్థ ద్వారా డిపోలను ఏర్పాటు చేయించి తక్కువ ధరలతో ఎరువులను అందించాలనే ప్రయత్నాలకు డిపోల యజమానులు తూట్లు పొడుస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో యూరియా బ్లాక్ మార్కెట్ విక్రయాలు విక్రయిస్తూ దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఆగ్రోస్ సేవా కేంద్రం, గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల ద్వారా బస్తా యూరియా రైతుకు రూ. 269.50కి అందాల్సి ఉంది. యూరియాను కొంతమంది వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌లో రూ. 350 నుంచి రూ. 450 వరకు విక్రయిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. పంటలు సాగు చేసి, యూరియాకోసం సచివాలయాల చుట్టూ తిరుగుతున్నా కేవలం ఒక ప్యాకెట్ మాత్రమే ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారని వాపోతున్నారు. రాయచోటిలోని ఆగ్రోస్ రైతు డిపోలో ఒకబస్తా రూ. 350లకు విక్రయించడంపై అన్నదాతలు ప్రశ్నించారు. రైతుల మాటలను ఖాతరు చేయని డిపో యజమాని తమకు ఇష్టం వచ్చిన ధరలకు విక్రయిస్తూ నచ్చితే కొనండి లేదంటే పక్కన కొనుగోలు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు మీడియాలో రికార్డు అయ్యింది. ఇదే విషయంపై వ్యవసాయసాఖ అధికారులకు రైతులు ఫిర్యాదు చేశారు.
లైసెన్సు రద్దు, ఎరువులు సీజ్......
ఫిర్యాదుపై స్పందించిన వ్యవసాయశాఖ రాయచోటి డివిజనల్ అధికారి శ్రీలత రెడ్డి, స్థానిక ఏఓలు అధిక ధరల విక్రయాలపై బుధవారం విచారణ చేశారు. అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు నిర్ధారణ కావడంతో 15 రోజులుపాటు గోదామును సీజ్ చేసి డీలర్ లైసెన్సు రద్దు చేశారు. గోదాంలో రూ. 50037 విలువచేసే 244.63 మెట్రిక్ టన్నుల ఎరువులను సీజ్ చేసినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.
నిరంతరం నిఘా ఉండాలి
ఎరువుల విక్రయాలపై సంబంధిత శాఖ అధికారుల నిరంతరం నిఘా సాగాలని రైతులు కోరుతున్నారు. ఎరువులు దుకాణాదారులతో వ్యవసాయశాఖ అధికారులు కుమ్మకై అధిక ధరలకు విక్రయిస్తున్నా సకాలంలో స్పందించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా సంబంధిత జిల్లా వ్యవసాయశాఖ అధికారులు స్పందించి బ్లాక్ మార్కెట్ విక్రయాలను అరికట్టి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు యూరియా అందేలా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు అవసరమయ్యే యూరియా ఉందని ప్రకటనలు ఇస్తున్నా అవి ప్రకటనలు లాగే మిగిలిపోయాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


