రాయచోటి (చిన్నమండెం) : ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృతంగా రైతులకు చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నమయ్య జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వెంకటమోహన్ పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించేలా రైతులకు సూచనలు, సలహాలను అందజేయాలని ప్రకృతి వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి అధికారులకు సూచనలు చేశారు. బుధవారం చిన్నమండెం మండలంలోని వండాడి గ్రామంలో నిర్వహించిన క్షేత్రపర్యటనలో భాగంగా ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను వారు పరిశీలించారు. రైతు రంజిత్ నాయక్ అమలు చేస్తున్న పీఎండీఎస్ క్షేత్రంలో సాగులో ఉన్న పంటలను పరిశీలించారు. పీఎండీఎస్ విధానం ద్వారా సాగు ఖర్చులు, నీటి వినియోగం, పంటల పెరుగుదల దిగుబడులపై రైతును వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్కువ నీటితో కూడా మెరుగైన దిగుబడులు సాధించేందుకు పీఎండీఎస్ విధానం రైతులకు ఎంతగానో ఉపయోగకరమని వారు రైతులకు వివరించారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు.


