గుర్రంకొండ : పిచ్చికుక్క దాడిలో నలుగురికి తీవ్రగాయాలైన సంఘటన మండలంలోని నడిమికండ్రిగలో జరిగింది. గత మంగళవారం రాత్రి గ్రామంలో ఆరుబయట పలువురు మంచాలు వేసుకొని నిద్రిస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చిన పిచ్చికుక్క ఒక్కసారిగా వీధుల్లో ఆరుబయట కూర్చొన్న, నిద్రిస్తున్న వారిపై దాడులు చేసి ఇష్టానుసారం కరిచింది. ఈ దాడుల్లొ గ్రామానికి చెందిన చిన్నరెడ్డెమ్మ(80), లక్ష్మీదేవి(55), వెంకటరమణ(60), రెడ్డెమ్మ(60)లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో చిన్నరెడ్డెమ్మకు కాలు, చేతిపైన, ముఖంపైన కరిచింది. బాధితురాలిని కుటుంబసభ్యులు గుర్రంకొండలొని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం పరిస్థితి విషమించడంతో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ముగ్గురు మదనపల్లెలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత వారం రోజులుగా పిచ్చికుక్క మూడు మార్లు దాడులు చేసినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


