పీలేరురూరల్ : విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇళ్లు దగ్ధమై సుమారు రూ. 6 లక్షలు ఆస్థినష్టం వాటిల్లిన సంఘటన బుధవారం పీలేరు పట్టణం బండ్లవంకలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. బండ్లవంక నడివీధిగంగమ్మ ఆలయం సమీపంలో నివాసం ఉంటున్న కె. గోవిందస్వామి ఇంటి కిందభాగంలో నివాసం ఉంటూ పై అంతస్తులో మెకానిక్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించి ఆరు ఎల్‌ఈడీ టీవీలు, పది ఫ్యాన్లు, వాషింగ్ మిషన్లు, గీసర్లు, బీరువా కాలిపోయాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. అప్పటికే వస్తువులు కాలిపోయాయి. జరిగిన నష్టాన్ని రెవెన్యూ సిబ్బంది బాధితుని ద్వారా తెలుసుకున్నారు.
నిందితుడికి జైలు శిక్ష
కలికిరి : పాల ట్యాంకరు నిర్లక్ష్యంగా నడిపి వ్యక్తి మృతికి కారణమైన కేసులో పాల ట్యాంకరు డ్రైవరుకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ వాల్మీకిపురం జూనియర్ సివిల్ కోర్టు జడ్జి తీర్పునిచ్చారు. పోలీసుల కథనం మేరకు... 2018 లో కలికిరి క్రాస్ రోడ్డు నందు రాజస్థాన్‌కు చెందిన చైత్రపాల్‌కుమార్ సుందేష్(14) ద్విచక్రవాహనంలో వెళుతుండగా పాలట్యాంకర్ డ్రైవర్ తమిళనాడు రాష్ట్రం నమ్మక్కల్‌కు చెందిన ఎం.వూవరసన్(30) ఢీ కొట్టాడు. ప్రమాదంలో చైత్రపాల్‌కుమార్ సుందేష్ మృతి చెందాడు. అప్పట్లో కలికిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన వాల్మీకిపురం జడ్జి నిందితునికి ఏడాది జైలు శిక్ష, రూ.15వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ మేరకు కలికిరి పోలీసులు అతన్ని మదనపల్లి సబ్ జైలుకు తరలించారు.
తక్కువ ధరకే బంగారం
అంటూ మోసం
జమ్మలమడుగు : తక్కువ ధరకే బంగారం వస్తోందని ఆశపడిన ఓ వ్యక్తి మోసపోయిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. మండల పరిధిలోని మోరగుడిలో భార్యాభర్తలు అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగించేవారు. ఈ నేపథ్యంలో మోరగుడిలోని సుబ్బరాయుడు అనే వ్యక్తికి చెందిన ఇంటిని బాడుగకు ఇవ్వాలని ఆయనను కోరారు. ఇంటికి మరమ్మతులు జరుగుతున్నాయని తర్వాత చూద్దాం అంటూ ఆయన చెప్పారు. దీంతో వారు తమ వద్ద బంగారు బిస్కెట్లు ఉన్నాయని, వాటిని తక్కువ ధరకే ఇస్తామని సుబ్బరాయుడును నమ్మబలికారు. ముందుగా బంగారం బిస్కెట్లను పగులగొట్టి అందులోని రెండు గ్రామాల బంగారం తీసి టెస్టింగ్ చేసుకోమని సుబ్బరాయుడుకు ఇచ్చారు. బంగారు దుకాణంలోకి వెళ్లిన ఆయన నిజమైన బంగారం అని తేల్చుకున్నారు. మొదట రెండు బిస్కెట్లకు రూ.12 లక్షలు డిమాండ్ చేయగా చివరకు రూ.4.30 లక్షలకు బేరం కుదుర్చుకుని ఏక మొత్తంగా డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకుని ఆ దంపతులు పరారయ్యారు. బిస్కట్లను తీసుకుని బంగారు దుకాణంలో చూపించగా అవి నకిలివని తెలడంతో బాధితుడు తన కుటుంబంతో కలిసి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


