హత్య కేసులో నిందితుడు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

హత్య కేసులో నిందితుడు అరెస్ట్‌

Aug 6 2026 2:08 AM | Updated on Aug 6 2026 2:08 AM

వాల్మీకిపురం : హత్యకేసులో నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ రాఘవ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ.. గత నెల 29వ తేదీ మండలంలోని చింతపర్తి సమీపంలో నివాసం ఉంటున్న లక్ష్మీదేవి హత్యకు గురైంది. ఈ విషయం గత నెల 31న వెలుగులోకి వచ్చింది. సంఘటనాస్థలంలో లభించిన వస్తువుల ఆధారంగా సీఐ కేసు దర్యాప్తు చేపట్టారు. కడప, నెల్లూరు జిల్లాలకు చెందిన దాదాపు 30 మంది బొగ్గు కాల్చే కార్మికులు చింతపర్తి సమీపంలోని ఓబులేశుని కొండ వద్ద బొగ్గు కాల్చుకొని జీవనం సాగిస్తున్నారు. ఇక్కడే నివాసం ఉంటున్న కూలీ మన్యం నాగరాజు (22) ఇక్కడే కూలీగా ఉన్న నల్లోల్లు లక్ష్మీదేవి (55)తో గత కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. వీరిద్దరు మద్యానికి బానిసయ్యారు. ఈ నేపథ్యంలో లక్ష్మీదేవి తరచూ నాగరాజును డబ్బులు ఇవ్వాలని, లేనిపక్షంలో అక్రమ సంబంధం విషయాన్ని బయటపెడతానని బెదిరించేది. దీంతో నాగరాజు లక్ష్మీదేవిపై కక్షపెంచుకొని ఎలాగైనా ఆమెను అంతం చేయాలని పథకం వేశాడు. ఈ క్రమంలో గత నెల 29న మద్యం తాగుదామని నమ్మించి ఆమెను ద్విచక్రవాహనంపై చింతపర్తి సమీపంలో ఎవ్వరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడే ఉన్న బండరాయితో బాది చంపేసి, ద్విచక్రవాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. ఈ కేసుకు సంబంధించి నాగరాజును బుధవారం పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై తిప్పేస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement