● మరో నలుగురికి తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్ : లారీ కారును ఢీకొట్టిన ఘటనలో ఒ మహిళ అక్కడికక్కడే మృతి చెంది, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం వేకువజామున అన్నమయ్య జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు.. అనంతపురానికి చెందిన అన్వర్ బాష (60) కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతనికి పలమనేరు మండలం, విరూపాక్షిపురంలో మందు పోయించుకుని రావడానికి కుటుంబ సభ్యులతో కారులో మంగళవారం రాత్రి 10 గంటలకు అనంతపురంలో బయలుదేరారు. కారులో అన్వర్‌బాష, అతని భార్య జుబేదా(42), కూతురు కౌసర్(20) అల్లుడు బబ్లు(24), ఇమ్రాన్ బాష (28) ఉన్నారు. కారు కురబలకోట మండలం, అంగళ్ళు విశ్వం కళాశాల వద్దకు రాగానే, వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టి ఆగకుండా వెళ్లి పోయింది. ఈ ప్రమాదంలో అన్వర్ బాషా భార్య జుబేదా (42) అక్కడికక్కడే దుర్మరణం చెందింది. కారులో ఉన్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కౌసర్ (20) పరిస్థితి విషమంగా ఉంది.సమాచారం అందుకున్న ముదివేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.


