సండ్రడివిలో
ములకలచెరువు : ప్రపంచంలోనే అత్యంత అరుదైన, ఖరీదైన లగ్జరీ కలప ‘ఎర్రచందనం’ శేషాచలం అడవుల సరిహద్దులు దాటి అన్నమయ్య జిల్లా పశ్చిమ ప్రాంత కరువు నేలలోనూ పచ్చగా వేళ్లూనుకుంటోంది. ములకలచెరువు మండలం, సండ్రడివి ప్రాంతంలో అటవీ శాఖ శాస్త్రవేత్తలు, అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగాత్మక ఎర్రచందనం సాగు ఊహించని రీతిలో ఘన విజయం సాధించింది. కరువు కోరల్లో చిక్కుకునే ఈ ప్రాంత వాతావరణం, నేలలు కూడా ఈ ఎర్రబంగారం పెంపకానికి వంద శాతం అనుకూలమని క్షేత్రస్థాయి ఫలితాలు నిరూపించాయి.
ఎర్రచందనంతో పాటు ఔషధ వనం..
అన్నీ సురక్షితం
సండ్రడివి అటవీ ప్రాంతంలో కేవలం ఎర్రచందనం మాత్రమే కాకుండా.. విభిన్న రకాల ప్రాణరక్షక ఔషధ మొక్కల పెంపకం కూడా అద్భుతంగా విజయవంతమైంది. 2015 సంవత్సరంలో ఇక్కడ 6వేల ఎర్రచందనం మొక్కలను నాటిన తరుణంలోనే, వాటితో పాటు పలురకాల విలువైన ఔషధ మొక్కల పెంపకాన్ని కూడా అటవీ శాఖ అధికారులు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. అధికారుల పర్యవేక్షణ, సిబ్బంది నిరంతర శ్రమతో ఇక్కడ నాటిన అలోవీర (కలబంద), అడవిగంధి, ఉసిరి, శ్రీగంధం, వేప, అల్లనేరేడు, వెలగ, తపసి, కుంకుడు మొక్కలన్నీ కరువు వాతావరణాన్ని తట్టుకుని ఏపుగా పెరిగి పెద్ద చెట్లుగా మారాయి. వనమూలికల సంరక్షణకు సండ్రడివి క్షేత్రం ఒక సరికొత్త ఆయుర్వేద కేంద్రంగా విరాజిల్లుతోంది.
500 ఎకరాలలో నీలగిరి వృక్షాల పండుగ
ఈ అడవిలో పదకొండేళ్ల నాటి మొక్కలతో పాటు, 20 ఏళ్ల క్రితం నాటిన నీలగిరి చెట్లు ప్రస్తుతం ఆకాశాన్నంటేలా భారీ వృక్షాలుగా రూపాంతరం చెందాయి. అటవీ సముదాయం పరిధిలోని సుమారు 500కు పైగా ఎకరాల అత్యంత విస్తారమైన అటవీ భూములలో నాటిన ఈ నీలగిరి మొక్కలు కూడా అధికారుల కృషితో వంద శాతం బతికి దట్టమైన అడవిలా మారాయి.
పదేళ్ల శ్రమ.. ట్యాంకర్లతో నీటి సరఫరా
ములకలచెరువు మండలం సండ్రడివి ప్రాంతంలో నాటిన ఈ అటవీ సంపద సంరక్షణను సవాల్‌గా తీసుకున్న అటవీశాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో నిరంతరం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పశ్చిమ కరువు ప్రాంతం కావడంతో కఠినమైన వేసవి కాలంలో ఈ మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారు. వీటికి సమయానికి అవసరమైన ప్రకృతి సిద్ధమైన సేంద్రియ ఎరువులను వేసి అద్భుతంగా కాపాడారు. అధికారుల అకుంఠిత దీక్ష, కష్టానికి తగ్గట్టుగానే అటవీ శాఖ ఆశించిన విధంగా సాగు చేసిన ఆ 6వేల ఎర్రచందనం మొక్కలతో పాటు ఔషధ, నీలగిరి తోటలలో ఒక్కటి కూడా ఎండిపోకుండా ప్రతి ఒక్క మొక్కా క్షేమంగా బతికి బట్టకట్టింది.
కందకాల ప్రయోగం.. ఇంకిన వర్షపు నీరు
వృక్షాలు నాటిన ప్లాంటేషన్ క్షేత్రంలో అటవీ శాఖ అధికారులు అత్యంత వ్యూహాత్మకంగా చిన్న చిన్న కందకాలను తవ్వించారు. వర్షాకాలంలో కురిసే ప్రతి చినుకు వృధా కాకుండా ఈ కందకాలలో వర్షపు నీరు సమృద్ధిగా నిలిచిపోయేలా ఏర్పాట్లు చేశారు. ఈ కందకాల వల్ల భూమిలో తేమ శాతం ఎక్కువ కాలం నిలిచి ఉండటంతో, చాలా రోజుల వరకు చెట్లకు సహజ సిద్ధంగా నీరందుతూ వృక్షాల వేగవంతమైన ఎదుగుదలకు ఎంతో దోహదపడింది. భవిష్యత్తులో ఈ కరువు మండల పరిధిలో మరిన్ని ప్రాంతాల్లో సామాజిక అడవుల కింద ఎర్రచందనం, ఆయుర్వేద మొక్కల పెంపకాన్ని విస్తరింపజేస్తే అటవీ సంపద పెరగడమే కాకుండా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుందని పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కరువు నేలలోనూ పచ్చగా వేళ్లూనుకున్న ఎర్రబంగారం, ఔషధ వనాలు
2015లో నాటిన 6వేల మొక్కలూ సురక్షితం
అటవీ శాఖ ప్రయోగం సూపర్ హిట్
500 ఎకరాలలో భారీ వృక్షాలుగా మారిన నీలగిరి తోటలతో సరికొత్త రికార్డు
కంటికి రెప్పలా కాపాడుకున్నాం
సండ్రడివిలో నాటిన ఎర్రచందనం మొక్కలను కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం. మొదట మూడేళ్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ట్యాంకర్ల ద్వారా మొక్కలకు నీరు పట్టాం. ప్రస్తుతం చెట్లయ్యాయి. ఇక వర్షాధారంగా చెట్లు పెరుగుతున్నాయి. ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్లి మరిన్ని మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాసులు, అటవీశాఖ అధికారి,
బురకాయకోట సెక్షన్


