సంబేపల్లె : అన్నమయ్య జిల్లాలో మామిడి సాగుకు తీవ్ర కష్టకాలం ముంచుకొచ్చింది. ప్రతి ఏటా ధరలు దారుణంగా పతనమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పల్ప్ ఫ్యాక్టరీలు, ర్యాంపుల నిర్వాహకులు సిండికేట్‌గా మారి మామిడి రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 30 వేల ఎకరాలలో సాగు చేసిన తోతాపురి రకం మామిడి ధరలు దారుణంగా పడిపోవడంతో.. కాయల కోత, కూలీలు, మందులు, రవాణా ఖర్చులకు కూడా డబ్బులు రాని దయనీయ స్థితి దాపురించింది. తోటల నిర్వహణ భారం కావడంతో దిక్కుతోచని స్థితిలో రైతన్నలు చేత గొడ్డలి పట్టి, జేసీబీల సహాయంతో చెట్లను నేలమట్టం చేస్తున్నారు.ఈ క్రమంలోనే సంబేపల్లె మండల పరిధిలోని నారాయణరెడ్డిపల్లె (బంగారువాండ్లపల్లె) సమీపంలో దాదాపు 13 ఎకరాల మామిడి తోటను పూర్తిగా నరికివేసి భూమిని చదును చేస్తున్నారు. కళ్లముందే పచ్చని తోట నేలమట్టం అవుతుంటే రైతులు పడుతున్న బాధ వర్ణనాతీతంగా మారింది. మామిడి సాగుతో అప్పులపాలు కావాల్సి వస్తోందని, అందుకే ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నామని కన్నీటిపర్యంతమవుతున్నారు.


