మదనపల్లెలో అత్యవసర చికిత్సా కేంద్రం | - | Sakshi
Sakshi News home page

మదనపల్లెలో అత్యవసర చికిత్సా కేంద్రం

Aug 5 2026 2:05 AM | Updated on Aug 5 2026 2:05 AM

సాక్షి, మదనపల్లె : జాతీయ రహదారి సమీపంలో ఉన్న మదనపల్లె వద్ద అత్యాధునిక అత్యవసర చికిత్సా కేంద్రం (ట్రామా కేర్‌ సెంటర్‌) ఏర్పాటు కోసం తక్షణమే పక్కా ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఇంచార్జి కలెక్టర్‌ శివ్‌ నారాయణ శర్మ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని గ్రామీణ, జాతీయ, రాష్ట్ర రహదారులకు అనుసంధానమయ్యే అన్ని ప్రధాన కూడళ్లలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. రహదారులపై వేగ నిరోధకాలు, హెచ్చరిక బోర్డులు, రాత్రి వేళల్లో వీధి దీపాలు వంటి మౌలిక భద్రతా ఏర్పాట్లను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు.

జూన్‌, జూలైలలో పెరిగిన ముప్పు..

ఎస్పీ వెల్లడి!

ఈ సమావేశంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి పవర్‌ పాయింట్‌ ప్రదర్శన ద్వారా రోడ్డు భద్రతకు సంబంధించి పోలీసు శాఖ క్షేత్రస్థాయిలో చేపడుతున్న చర్యలను సమగ్రంగా వివరించారు. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో రోడ్డు ప్రమాదాలు 20 శాతం తగ్గినప్పటికీ.. జూన్‌, జూలై నెలల్లో ప్రమాదాల సంఖ్య మళ్లీ పెరిగిందని ఎస్పీ ఆందోళన వ్యక్తం చేశారు. వాహనాల అతివేగం, అడ్డగోలు ఓవర్‌టేకింగ్‌, భారీ వాహనాల రద్దీతో పాటు ముఖ్యంగా రాత్రి వేళల్లో తిరిగే ట్రాక్టర్లపై కాంతిని ప్రతిబింబించే పట్టీలు (రిఫ్లెక్టివ్‌ టేపులు), హెచ్చరిక లైట్లు లేకపోవడమే ఈ ప్రమాదాల పెరుగుదలకు ప్రధాన కారణమన్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై తిరిగే ప్రతీ ట్రాక్టర్‌కు తప్పనిసరిగా రేడియం పట్టీలు, వెనుక లైట్లు ఏర్పాటు చేసేలా రవాణా శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్‌స్పాట్‌ల వద్ద శాశ్వత పరిష్కారాలు చేపట్టడంతో పాటు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించేలా కఠిన తనిఖీలు నిర్వహించాలని పేర్కొన్నారు.

సహాయకులను వేధించొద్దు!

రహదారులపై ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను సకాలంలో ఆసుపత్రులకు తరలించి ప్రాణాలు కాపాడే మంచి సహాయకులను (గుడ్‌ సమారిటన్లను) పోలీసులు కానీ, కోర్టుల పేరిట ఇతరులు కానీ ఎలాంటి ఇబ్బందులు కలిగించరాదని ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ప్రభుత్వ మార్గదర్శకాలను జిల్లాలోని అన్ని ఆసుపత్రులు మరియు పోలీసు అధికారులు తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 236 ప్రమాద ప్రాంతాలను గుర్తించగా, వాటిలో ఇప్పటికే 108 చోట్ల వేగ నిరోధకాలు ఏర్పాటు చేసినట్లు, మిగిలిన 128 అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఇంచార్జ్‌ కలెక్టర్‌ ఆదేశించారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ వెంకటాద్రి, జిల్లా రవాణా శాఖ అధికారి ప్రతాప్‌, ఆర్‌ అండ్‌ బి, జాతీయ రహదారుల విభాగం, వైద్యారోగ్య, మున్సిపల్‌ కమిషనర్లు, డీఎస్పీలు, స్టేషన్‌ అధికారులు పాల్గొన్నారు.

ఇంచార్జ్‌ కలెక్టర్‌ ఆదేశం!

గత ఏడాదితో పోలిస్తే జనవరి–మే మధ్య 20 శాతం తగ్గిన రోడ్డు ప్రమాదాలు

జూన్‌, జూలైలలో పెరిగిన ఘోరాలు

ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి పవర్‌ పాయింట్‌ ప్రదర్శన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement