మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారింది. మంగళవారం సాయంత్రం మదనపల్లెలో చిరు జల్లులు పడ్డాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండ కాసినప్పటికీ, సాయంత్రానికి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని వర్షం మొదలైంది. అకస్మాత్తుగా కురిసిన వర్షం కారణంగా వాహనదారులు, చిరు వ్యాపారులు కాస్త అవస్థలు పడ్డారు. గత రెండు రోజులుగా జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండెం, సంబేపల్లె, రాయచోటి, రామాపురంలో వర్షం కురిసింది. అలాగే పీలేరు నియోజకవర్గంలోని కలకడ, కేవిపల్లె, పీలేరు, కలికిరి, వాల్మీకిపురం, సదుం మండలాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది. రాబోయే రోజుల్లోనూ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ముద్దచర్మ వ్యాధి నివారణ
టీకాలను పశువులకు వేయించాలి
రాయచోటి (చిన్నమండెం) : రైతులు పశువులకు ముద్దచర్మ వ్యాధి నివారణ టీకాలను వేయించాలని జిల్లా పశు సంవర్థకశాఖాధికారి డాక్టర్ గుణశేఖర్ పిళ్‌లై అన్నారు. చిన్నమండెం మండల పరిధిలో జరుగుతున్న ముద్దచర్మ వ్యాధి నివారణ టీకాల పనితీరును మంగళవారం ఆయన పరిశీలించారు. దిగువగొట్టివేడు, చాకిబండ, మల్లూరు, చిన్నమండెం గ్రామాలలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఈనెల 1వ తేది నుంచి 31వ తేది వరకు రైతు సేవా కేంద్రాల పరిధిలో పశువులకు ఉచితంగా టీకాలు వేస్తామన్నారు. పర్యటనలో భాగంగా చిన్నమండెం మండల కేంద్రంలో జరుగుతున్న నూతన పశువైద్యశాల నిర్మాణాన్ని పరిశీలించారు.
ఓపెన్ స్కూల్ ప్రవేశాలను సద్వినియోగం చేసుకోండి
రాయచోటి టౌన్ : ఓపెన్ స్కూల్ ప్రవేశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీఓఎస్‌ఎస్) జిల్లా కో– ఆర్డినేటర్ కొండూరు శ్రీనివాస రాజు సూచించారు. మంగళవారం బాలికోన్నత పాఠశాల ఆవరణంలో ఓపెన్ స్కూల్ ప్రవేశాలపై అవగాహన కల్పించాలని కరపత్రాలను విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదైనా కారణాల చేత బడిని మధ్యలో మానేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఓపెన్ స్కూల్ పద్ధతి ద్వారా 10వ తరగతి, పదవ తరగతి పాస్ అయిన వారు ఇంటర్మీడియ్ కోర్సులో చేరేందుకు అర్హులని తెలిపారు. అలాగే ఈ ఓపెన్ పరీక్షలు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, ఒరియా భాషలలో ప్రవేశాలు ఉన్నా యని తెలిపారు. ఈ అవకాశాలను అర్హత కలిగిన వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఇస్రో శాస్త్రవేత్తగా
సచివాలయ ఉద్యోగి
కలసపాడు : మండలంలోని శంఖవరం గ్రామానికి చెందిన సచివాలయ ఉద్యోగి సి.వి.రమేష్‌కుమార్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పరిధిలోని విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎస్‌సీ – తిరువనంతపురం)కు శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో ఆయన ఈ అరుదైన ఘనత సాధించారు. రమేష్‌కుమార్ గతంలో కలసపాడు మండలంలోని పిడుగుపల్లె, కలసపాడు సచివాలయాల్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించారు. రైతు కుటుంబంలో పుట్టి కఠిన శ్రమ, నిరంతర కృషితో ఇస్రోలో శాస్త్రవేత్త ఉద్యోగం సాధించడం తన జీవితంలో మరువలేని అనుభూతిని ఇచ్చిందని రమేష్‌కుమార్ ఆనందం వ్యక్తం చేశారు.
పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా కందుల
కడప ఎడ్యుకేషన్ : ప్రోగ్రెసివ్ రికగ్నైజ్‌డ్ టీచర్ యూనియన్ (పీఆర్‌టీయూ) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన సీనియన్ ఉపాధ్యాయులు కందుల వెంకటసుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా క్రిష్ణయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిప్రసాద్‌లు నియామక ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సందర్భంగా కందుల వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ పీఆర్‌టీయూ బలోపేతానికి మరింత కృషి చేస్తానన్నారు.


