రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు

Aug 5 2026 1:59 AM | Updated on Aug 5 2026 1:59 AM

మదనపల్లె టౌన్‌ : అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోనుంది. మంగళవారం మదనపల్లె కలెక్టరేట్‌లో జిల్లా రోడ్డు సేఫ్టీ కమిటీ(డీఆర్‌ఎస్‌సీ) ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ శివ్‌ నారాయణశర్మ, జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి అధ్యక్షత వహించారు. సమావేశాన్ని ఉద్దేశించి జేసీ శివ్‌ నారాయణ శర్మ మాట్లాడుతూ విద్యాసంస్థలు, రద్దీ ప్రాంతాల వద్ద జీబ్రా క్రాసింగ్‌లు ఏర్పాటు చేయాలని తెలిపారు. జాతీయ రహదారులపై దుమ్ము, ధూళిని ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. రహదారులపై వీధి దీపాలు వెలిగేలా చూడాలని చెప్పారు. బ్లాక్‌ స్పాట్స్‌ గుర్తించి సంయుక్త తనిఖీలు చేసి తక్షణ భద్రతా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రమాద బాధితులకు తక్షణ వైద్యం కోసం జిల్లాకు ప్రత్యేక ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటు, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడిన రహ్‌ వీర్‌లను ఆగస్టు 15 నాటికి గుర్తించి సత్కరించాలన్నారు. జాతీయ రహదారుల వెంబడి వాహనదారుల విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్‌కు అడ్డంగా ఉన్న చెత్త కుండీలు, అడ్డంకులను వెంటనే తొలగించాలని తెలిపారు.

వాహన తనిఖీలు పెంచాలి

ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి మాట్లాడుతూ వ్యవసాయ ట్రాక్టర్ల వెనుక రేడియం రిఫ్లెక్టర్లు అతికించాలన్నారు. రహదారిపైకి వచ్చే పశువుల మెడలకు రిఫ్లెక్టివ్‌ కాలర్‌ టేపులు ఉండేలా చూడాలని తెలిపారు. సాయంత్రం 6 నుండి రాత్రి 9 మధ్య ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున ఆ సమయంలో పోలీస్‌ నిఘా, వాహన తనిఖీలు పెంచాలని సూచించారు. అనధికార పార్కింగ్‌ ప్రాంతాల్లో నో పార్కింగ్‌ బోర్డులు ఏర్పాటు చేసి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని దేశించారు. మదనపల్లెలో అనవసర స్పీడ్‌ బ్రేకర్లను వెంటనే తొలగించాలని చెప్పారు. ఆటోల కోసం ప్రత్యేక స్టాండ్లు గుర్తించి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమీళ, రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్‌ కృష్ణమోహన్‌, రవాణా, వైద్య, పంచాయతీరాజ్‌ అధికారులు, మదనపల్లె, రాయచోటి ట్రాఫిక్‌ సీఐలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement