● భర్తపై భార్య హత్యాయత్నం
● ముగ్గురు నిందితుల అరెస్ట్
గుర్రంకొండ : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే భర్తపై.. భార్య మరో ఇద్దరితో కలసి అంతమెందించాలని ప్రయత్నించింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వాల్మీకిపురం సీఐ రాఘవరెడ్డి, గుర్రంకొండ ఎస్‌ఐ రవీంద్రబాబుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుర్రంకొండ మండలం రామాపురం గ్రామానికి చెందిన టి.శ్రీనివాసులు కుమార్తె వనజకు కురబలకోట గ్రామానికి చెందిన తరిగొండ రఘనాథ్‌తో 22 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. గత కొంత కాలంగా భార్య ప్రవర్తనపై అనుమానం కలిగి తీరు మార్చుకోవాలని భర్త పలుమార్లు హెచ్చరించారు. అయితే లెక్కచేయకుండా వనజ అలాగే ప్రవర్తించింది. దీంతో భార్యభర్తల మధ్య గొడవలు జరిగి వనజ పుట్టినిల్లు అయిన రామాపురానికి వచ్చేసింది.
చనిపోయాడని.. పొదల్లో పడేసి..
గత నెల 30న రఘనాథ్ భార్య పిల్లలను తనతో తీసుకురావడానికి గానూ రామాపురం వెళ్లాడు. దీంతో తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన వనజ(38).. ప్రియుడు కావలి రామ్మోహన్(50), తండ్రి టి.శ్రీనివాసులు(56)తో కలిసి ముందస్తు పథకం ప్రకారం రఘనాథ్‌ను ద్విచక్రవాహనంపై గుర్రంకొండకు సమీపంలో విద్యుత్ సబ్‌స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ కట్టెలు, రాళ్లతో విచక్షణా రహితంగా రఘనాథ్‌పై దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన రఘనాథ్ అపస్మారక స్థితికి చేరుకొన్నాడు. దీంతో అతడు మృతి చెంది ఉంటాడని భావించి సమీప పొదల్లో పడేసి వెళ్లిపోయారు. అటు వైపు వెళుతున్న కొందరు వ్యక్తులు అతన్ని గమనించి 108 వాహనం ద్వారా మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో నిందితులు మంగళవారం వాల్మీకిపురంలో ముందస్తు బెయిల్ కోసం న్యాయవాదిని కలిసేందుకు వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే నేరానికి వినియోగించిన ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిఽందితులను వాల్మీకిపురం కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ, ఎస్‌ఐ తెలిపారు.


