మదనపల్లె టౌన్ : నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు సృష్టించి కోట్ల రూపాయల విలువైన భూముల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠాపై మదనపల్లె తాలూకా పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో మండలంలోని మొలకలదిన్నెకు చెందిన ఉప్పుతోల్ల శేఖర్‌బాబు సహా మరో నలుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసిన ముగ్గురు డాక్యుమెంట్ రైటర్లను అరెస్ట్ చేసినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ మీడియాకు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. మదనపల్లె మండలం బసినికొండ పంచాయతీ గంగన్నగారిపల్లె పరిధిలోని సుమారు రూ.5 కోట్ల విలువైన 2.52 ఎకరాల వ్యవసాయ భూమిని తక్కువ ధరకు ఇప్పిస్తామని మొలకలదిన్నెకు చెందిన ఉప్పుతోళ్ల శేఖర్ బాబు, గంగన్నగారిపల్లెకు చెందిన మరో నలుగురు బసినికొండకు చెందిన శోభారాణిని నమ్మించారన్నారు. ఆమె వద్ద రూ.14 లక్షలు తీసుకుని, అనంతరం నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు, ఇతర తప్పుడు పత్రాలు అందజేసి మోసం చేయడంతో ఆ కేసులో ఉన్న డాక్యుమెంట్లు రైటర్లు ఎ6 మినహా సొసైటీ కలనీకి చెందిన ఏ7 నిందితుడు ఏనుగు హరిబాబు నాయుడు (65), ఈశ్వరమ్మ కాలనీకి చెందిన ఏ–8 మత్తెపు సుబ్రమణ్యం(72), పెద్దమండ్యం మండలం కలిచర్లకు చెందిన ఏ–9: సయ్యద్ మస్తాన్ (56)లను అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ దీరజ్ కునుబిల్లి ఆదేశాలతో ఈ అరెస్టులు జరిగాయని సీఐ తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని, భూ మోసాల్లో ఎవరైనా పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


