బద్వేలు అర్బన్ : ఆ యువకుడికి మరో నెల రోజుల్లో వివాహం జరిపించాలని పెద్దలు నిర్ణయించారు. పెళ్లి పత్రికలు కూడా ముద్రించారు. అంతలోనే విధికి కన్ను కుట్టినట్లుంది. పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ హృదయ విషాదకర ఘటన బద్వేలు పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని కొత్తచెరువు గ్రామానికి చెందిన మల్లేష్, లక్షుమ్మలకు యమ్మని శివశంకర్(25) ఏకై క కుమారుడు. కొన్నేళ్ల క్రితం మల్లేష్ మృతి చెందడంతో శివశంకర్ ఇంటి పెద్దదిక్కుగా వ్యవహరిస్తూ గోపవరం సమీపంలోని సెంచూరీ పానెల్స్ పరిశ్రమలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుండే వాడు. రోజూ మాదిరే మంగళవారం తన ద్విచక్ర వాహనంలో డ్యూటీకి వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో సిద్దవటం రోడ్డులోని అబ్బుసాహెబ్‌పేట క్రాస్‌రోడ్డు – బయనపల్లె సబ్‌స్టేషన్ నడుమ ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలై శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు 108 సహాయంతో మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పెళ్లి కుమారుడిగా చూడాలనుకుంటే అప్పుడే నూరేళ్లు నిండాయా అంటూ శివశంకర్ కుటుంబ సభ్యులు విలపించిన తీరు అక్కడి వారిని కలచివేసింది. అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం


