స్కూళ్లు తెరిచారంటే చాలు.. రోడ్లపై పిల్లలు పీచు మిఠాయి తింటూ సందడి చేయడం సాధారణమే. అయితే మైదుకూరులో శనివారం రాజస్థాన్‌కు చెందిన గబ్బర్ సింగ్ అనే యువకుడు సరికొత్త ప్యాకింగ్‌తో పీచు మిఠాయిలు అమ్ముతూ అందరి దృష్టిని ఆకర్షించాడు. సాధారణంగా పీచు మిఠాయిని పుల్లకు చుట్టి లేదా పాలిథిన్ కవర్లలో అమ్ముతుంటారు. కానీ, అలా అమ్మితే గాలికి దుమ్ము చేరడం లేదా మిఠాయి కరిగిపోవడం జరుగుతుందని గబ్బర్ సింగ్ తెలిపాడు. అందుకే ఒక్కొక్కటి రూ.4 చొప్పున ప్లాస్టిక్ డబ్బాలను కొనుగోలు చేసి, వాటిలో నీలం, ఎరుపు, ఆకుపచ్చ, ఆరెంజ్, పసుపు, తెలుపు వర్ణాల పీచు మిఠాయిలను నింపి విక్రయిస్తున్నాడు. ఈ రంగురంగుల సరికొత్త ప్యాకింగ్ పిల్లలను ఇట్టే ఆకర్షిస్తోంది. ఈ వినూత్న వ్యాపార శైలి స్థానికంగా ప్రత్యేకంగా నిలిచింది. – మైదుకూరు


