కలికిరి: కలికిరి గ్రామదేవత శ్రీ ఎల్లమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం అమ్మవారు పుష్పాలంకృత తేరుపై (రథం) పురవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఆర్‌ఎస్ రోడ్డు, మెయిన్ బజారు మీదుగా సాగిన రథోత్సవంలో భక్తులు కర్పూర హారతులతో మొక్కులు తీర్చుకున్నారు.
అమ్మవారికి బోనాలు
మధ్యాహ్నం నుంచి చుట్టుపక్కల గ్రామాల మహిళలు సంప్రదాయ వాయిద్యాలు, బళ్ళారి డ్రమ్స్ నడుమ ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి దీపాలు, బోనాలు, చీర, సారె సమర్పించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు చాందినీ బండ్ల ప్రదర్శన, అనంతరం బలిదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. మూడో రోజైన సోమవారం ఎల్లమ్మ సర్వదర్శనం, రాత్రి 8 గంటలకు లంకాదహనం, అనంతరం పుష్పపల్లకీ వాహనంపై అమ్మవారి ఊరేగింపు జరగనున్నాయి. ఉత్సవాల్లో ఆలయ ధర్మకర్త ఆశోక్‌కుమార్ రెడ్డి, నిర్వాహకులు పాల్గొన్నారు. రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ పర్యవేక్షణలో కలికిరి సీఐ అనీల్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.


