మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలోని ఓ ప్రైమరీ స్కూల్‌లో చిన్న పిల్లలకు అన్యమత బోధనలు చేస్తున్నారన్న ఆరోపణలతో స్థానికంగా కలకలం రేగింది. మదనపల్లె ఎస్బిఐ కాలనీ ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు అన్యమత ప్రచారాలు, మతపరమైన బోధనలు చేస్తుండటం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో చిన్నపిల్లలకు మత బోధనలు చేస్తున్నాడని స్థానికులు గుర్తించి, మతబోధనలు వీడియోలలో చిత్రీకరించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకుని, స్కూల్ యాజమాన్యంతో గొడవకు దిగారు. విద్యాలయాలు జ్ఞానాన్ని పంచే దేవాలయాలుగా ఉండాలి తప్ప మత ప్రచార కేంద్రాలుగా మారకూడదని, పసిపిల్లల మనస్సులలో ఇటువంటి విత్తనాలు నాటడం విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖాధికారితో పాటు మండల విద్యాశాఖాధికారుల పట్టింపులేని తనంతోనే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఈఓ, ఎంఈఓలు తక్షణమే స్పందించి, జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం ఈ ఆరోపణలపై విద్యాశాఖ అధికారుల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. నిబంధనల ప్రకారం పాఠశాలల్లో మతపరమైన బోధనలకు అవకాశం లేదు. విచారణలో వాస్తవాలు తేలిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
పాఠశాల యాజమాన్యంపై
తల్లిదండ్రుల ఆగ్రహం


