పెద్దమండ్యం: మండలంలోని వెలిగల్లు పంచాయతీ పాపదాతగారిపల్లెకు చెందిన ఇరగమ్మ అదృశ్యమై 15 రోజులు అవుతున్నా ఆమె ఆచూకీ తెలియరాలేదు. అదృశ్యంపై కేసు నమోదు చేసిన పోలీసులకు ఆచూకీ కనుక్కోవడం సవాల్‌గా మారింది. పాపదాతగారిపల్లెకు చెందిన కొంకల రెడ్డెప్పరెడ్డి రెండో భార్య ఇరగమ్మ (53) తల్లితో కలిసి నివసిస్తోంది. అదే పల్లెలో ఉన్న భర్త ఇంటి దగ్గరికి వెళ్లి వస్తూ ఉండేది. ఆర్థికంగా బాగానే ఉన్న ఇరగమ్మ గ్రామ పరిధిలోనే కాకుండా ఇతర ప్రాంతాలలో ఉన్న పలువురు వ్యాపారస్థులు, రైతులకు డబ్బులు వడ్డీకి ఇచ్చేదని సమాచారం. పెద్ద మొత్తంలోనే ఈమెకు ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు తెలిసింది. ఇంటి నుంచి గ్రామానికి సమీపంలో ఉన్న ఓ పల్లెకు వెళుతున్నట్లు చెప్పారని భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ప్రామిషరీ నోట్ రాయించుకొనేందుకు పల్లెకు వెళ్లి అదృశ్యమైందని తెలిసింది. ఆర్థిక లావాదేల నేపథ్యంలో ఆమెను ఎవరైనా ఏమైనా చేశారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇరగమ్మ ఆచూకీ కోసం ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
మదనపల్లె టౌన్ : అన్న కుటుంబంపై తమ్ముడు కరల్రతో దాడికి పాల్పడి ముగ్గరిని గాయపరిచాడు. ఆదివారం సాయంత్రం మదనపల్లి మండలంలో జరిగిన ఘటనపై బాధితులు తాలూకా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై వివరాలు.. మండలంలోని వలసపల్లె పంచాయతీ గుట్టకిందపల్లికు చెందిన గంగులప్పకు, కృష్ణమూర్తికి ఉమ్మడిగా పూర్వీకుల ఆస్తి ఐదు ఎకరాలు ఉంది. ఇటీవల ఆ భూమిని అన్నదమ్ములు భాగపరిష్కారం చేసుకున్నారు. గంగులప్ప గతంలో వేసిన బోరును, పంటల సాగుకోసం తమ్ముడు కృష్ణమూర్తి మరమ్మతు చేయిస్తుండగా గంగులప్ప అడ్డుకున్నాడు. దీంతో అన్నదమ్ముల మధ్య గొడవ తలెత్తి పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో గంగులప్ప అతని కుమారుడు శివ, కోడలు భాగ్యలక్ష్మి గాయపడ్డారు. ఎదురుదాడిలో కృష్ణమూర్తి కూడా స్వల్పంగా గాయపడ్డాడు. బాధితులను కుటుంబీకులు స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు వైద్యం అందించడంతో కోలుకుంటూ ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉందని తాలూకా పోలీసులు తెలిపారు.


