తంబళ్లపల్లె : మండలంలోని కన్నెమడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1978–79 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 48 ఏళ్ల తరువాత ఆదివారం అదే పాఠశాలలో కలుసుకున్నారు. ప్రస్తుతం ఎక్కడెక్కడో స్థిరపడ్డవారు పూర్వ విద్యార్థుల సమావేశానికి హాజరయ్యారు. అలనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలు కలియ తిరుగుతూ అనాడు చేసిన అల్లరిని నెమరు వేసుకున్నారు. తోటి మిత్రలతో పోటాపోటీగా సెల్పీలు తీసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉల్లాసంగా గడిపారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల క్రితం బడిలో చేసిన అల్లరిని, మధురానుభూతులను గుర్తు చేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు తలచుకున్నారు. తమతోపాటు చదువుకుని మృతి చెందిన తమ బాలమిత్రుల ఆత్మశాంతి కోసం కొద్ది సేపు మౌనం పాటించారు. ప్రస్తుత పాఠశాల హెచ్‌ఎం మదన్‌మోహన్‌కు ఘనంగా సన్మానించారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. తిరుపతి, హైదరాబాదు, బెంగుళూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన పూర్వపు విద్యార్థులు పాల్గొన్నారు.


