యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు
టాస్క్‌ఫోర్స్ : ‘ఇప్పుడు కాకపోతే మరెప్పుడు సంపాదించుకుంటాం. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి’ అన్నట్లుగా కొందరు కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. ఎంతో విలువైన మట్టిని ఆదాయ వనరులుగా మార్చుకున్నారు. ‘మా ప్రభుత్వంలో మమ్మల్ని అడిగేదెవరు.. ఆపేదెవరు’ అంటూ ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. సంబేపల్లె మండలంలోని కొండావాండ్లపల్లె చెరువు, మోటకట్ల చెరువు, లాభం చెరువులలో జేసీబీలు, ప్రొక్లెయిన్‌లతో యథేచ్ఛగా రాత్రి, పగలు మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. నిబంధనలకు పాతర వేసి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. నిత్యం వందలాది ట్రాక్టర్లు, టిప్పర్లతో అక్రమంగా మట్టిని అమ్ముకొని జేబులు నింపుకొంటున్నారు. నారాయణరెడ్డిపల్లె గ్రామం అభం చెరువులో మట్టి తవ్వకాలతో.. 20 నుంచి 30 మీటర్ల లోతుతో వంద మీటర్ల వెడల్పుతో భారీగా గుంతలు పడ్డాయి. ఇలాంటి గుంతలు చెరువులలో తీస్తుంటే సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదంటే.. పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతుంది. సంబేపల్లె మండలంలోని ఏపి కొండ సమీపం నుంచి గ్రావెల్, మోటకట్ల సమీపంలోని చెరువు నుంచి వందల సంఖ్యలో టిప్పర్లతో మట్టిని తరలించారు. లేవుట్ల వేస్తున్నారంటే ఈ ప్రాంతం నుంచి రాత్రిపూట మట్టిని తరలిస్తారు. ప్లాట్ల చదును కోసం దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం అటు వైపు చూడటం లేదంటే.. వారికి ఏ స్థాయిలో ముడుపులు వెళ్లుతున్నాయో నని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమంగా తరలిస్తున్న మట్టి మాఫియాను అడ్డుకోవాలని వారు కోరుతున్నారు.
మాఫియాగా మారిన కొందరు కూటమి నేతలు
పట్టించుకోని అధికారులు


