జిల్లాలో స్తంభించిన రిజిస్ట్రేషన్లు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో స్తంభించిన రిజిస్ట్రేషన్లు

Jul 21 2026 12:17 AM | Updated on Jul 21 2026 12:17 AM

సాక్షి, మదనపల్లె : కూటమి ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలను నిరసిస్తూ సోమవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న 13 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలోని దస్తావేజు లేఖరులు పెన్‌ డౌన్‌ కార్యక్రమం చేపట్టారు. ఈనెల 31 వరకు ఈ నిరసన కార్యక్రమం కొనసాగించనున్నారు. తొలిరోజు దస్తావేజు లేఖరులు వారి కార్యాలయాల పరిధిలో నిరసనలు చేపట్టి ధర్నాలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దస్తావేజులపై ఆధారపడి జీవిస్తున్న తమ కుటుంబాలను రోడ్డుపాలు చేయొద్దంటూ నినదించారు. చంద్రబాబు సర్కార్‌ ప్రజల విలువైన ఆస్తులతో ముడిపడిన రిజిస్ట్రేషన్ల వ్యవహారాన్ని ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో వారికి అప్పగించేలా జీవో నెంబర్‌ 396 జారీ చేసింది. ఈ జీవో వల్ల ఇప్పుడు జిల్లాలో 150 మందికి పైగా దస్తావేజు లేఖలు తమ జీవనభృతిని కోల్పోనున్నారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. తొలుత జిల్లా కేంద్రాల్లో, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. విలువైన ప్రజల ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల విషయంలో తమకు భాగస్వామ్యం కల్పించకపోవడంపై ఇప్పుడు పనిచేస్తున్న దస్తావేజు లేఖరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో రిజిస్ట్రేషన్ల శాఖను పెడితే, వారు వివాదాస్పదంగా వ్యవహరించి సామాన్యుల ఆస్తులకు భంగం కలిగించే అవకాశాలు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ణయించిన రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయవద్దని, ఇప్పుడున్న యధాతధ పరిస్థితిని కొనసాగించాలని దస్తావేజు లేఖరులు ప్రభుత్వానికి డిమాండ్‌ చేస్తున్నారు.

స్తంభించిన కార్యకలాపాలు

దస్తావేజు లేఖరుల పెన్‌డౌన్‌ కార్యక్రమంతో సోమవారం జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. జిల్లా కేంద్రంలోని మదనపల్లె, బి.కొత్తకోట, తంబళ్లపల్లె, పుంగనూరు, వాయల్పాడు, పీలేరు, కలికిరి, రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, సుండుపల్లి, రాజంపేట, చిట్వేలి, పుల్లంపేట కార్యాలయాల పరిధిలోని దస్తావేజు లేఖరులు పెన్‌ డౌన్‌ నిర్వహించారు. దాంతో ప్రతిరోజు జరిగే 150 నుంచి 200 రిజిస్ట్రేషన్లు పూర్తిగా ఆగిపోయాయి. క్రయవిక్రయాలు జరుపుకునే ప్రజలు కూడా కార్యాలయాల వైపునకు రాలేదు. దాంతో నిత్యం కిటకిటలాడే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు బోసిపోయాయి. దీనివల్ల సోమవారం ఒకరోజు తమ శాఖకు రూ.కోటి ఆదాయానికి నష్టం వాటిల్లిందని జిల్లా రిజిస్ట్రేషన్ల శాఖ అధికారి ఉమామహేశ్వరి చెప్పారు.

బోసిపోయిన 13 కార్యాలయాలు

ఆగిపోయిన 200 రిజిస్ట్రేషన్లు,

రూ.కోటి ఆదాయం నష్టం

జిల్లా వ్యాప్తంగా హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు

ప్రజలే డాక్యుమెంట్లు చేసుకోవచ్చని అధికారుల సూచన

హెల్ప్‌ డెస్కులు ఏర్పాటు

దస్తావేజు లేఖరులు సమ్మె చేస్తుండడంతో రిజిస్ట్రేషన్లు జరుపుకునే ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని జిల్లా రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారి ఉమా మహేశ్వరి చెప్పారు. ఈ మేరకు జిల్లాలోని 13 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సోమవారం నుంచి హెల్ప్‌ డెస్క్‌ లను ఏర్పాటు చేశారు. ఒక్కో కార్యాలయంలో ఒక్కో ఉద్యోగిని నియమించారు. వీరు రిజిస్ట్రేషన్లకు వచ్చే ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తారు. దస్తావేజులు తయారు చేసుకునే తీసుకువస్తే వాటిని స్లాట్‌ విధానంలో ఆమోదించి రిజిస్ట్రేషన్లు చేస్తారు. ప్రజలకు ఇబ్బందులు ఉండకూడదని వీటిని ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement