సాక్షి, మదనపల్లె : ఖరీఫ్ పంటల సాగు పాతికేళ్ల చరిత్రలో ఎన్నడూ చూడని దుర్భిక్ష పరిస్థితి ప్రస్తుతం జిల్లా రైతాంగాన్ని వెంటాడుతోంది. ఎల్‌నినో రూపంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడి, రైతులు కనీసం తమ ఇంటి అవసరాల కోసం అవసరమైన పంటలను కూడా సాగు చేయలేని పరిస్థితికి వచ్చారు. కూటమి ప్రభుత్వం రాక ముందు వరకు ఈ పరిస్థితి రైతులకు ఎదురు కాలేదు. 2024 ఖరీఫ్ నుంచి వరుసగా రైతులకు ఎదురు దెబ్బలు పడుతున్నాయి. పంటలు సాగు చేయలేని నిస్సహస్థితికి వచ్చారు. గత రెండేళ్ల ఖరీఫ్ లో కరువు పరిస్థితుల్లో వెంటాడితే, ఇప్పుడు ఎల్‌నినో వెంటాడింది. తీవ్రమైన కరువు, దుర్భిక్షాన్ని తీసుకొచ్చింది.
ఖరీఫ్ ముగిసింది
సాధారణంగా ఖరీఫ్ పంటల సాగుకు జూలై 15 వరకు అనుకూలం. జూన్‌లో వర్షాలు కురవకపోతే జూలై వర్షాలపై ఆధారపడి పంటలు సాగవుతాయి. ఏప్రిల్ మూడో వారం నుంచి దుక్కులు దున్ని, మీ చివరి నాటికి పంటలు విత్తడం, జూలై నెలాఖరుకు అన్ని పంటల సాగు పూర్తి చేస్తారు. ప్రస్తుత ఖరీఫ్‌లో ఈ పరిస్థితి లేదు. జూన్‌లో వర్షపాతం 77.5 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 31.2 మిల్లీమీటర్ల లోటు నమోదైంది. జూలై వర్షపాతం ఒక మిల్లీమీటర్ కూడా కురవలేదు. ప్రధానంగా జూన్ 14 నుంచి (జూలై 16) వరకు జిల్లాలో చినుకు జాడలేదు. ఈ నెలలో 90.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా రెండు వారాలైనా ఒక్క మిల్లీమీటర్ వర్షం కూడా పడలేదు. దీంతో తీవ్ర వర్షాభావం మధ్య ఖరీఫ్ కథ ముగిసిపోయింది.
దారుణమై పంటల సాగు
జిల్లాలో గత రెండు ఖరీఫ్‌లలో కరువు పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అంతో ఎంతో పంటలు సాగయ్యాయి. ప్రస్తుత ఖరీఫ్‌లో మాత్రం పంటసాగన్న మాటే లేకుండా పోయింది. జిల్లాలో ఇప్పటి ఖరీఫ్‌లో 46,055 హెక్టార్లలో ప్రధాన పంటలు సాగుతాయని అంచనా వేశారు. గత ఖరీఫ్‌లతో పోలిస్తే ఈ విస్తీర్ణం తక్కువ. అయినప్పటికీ జూలై 11 నాటికి సాగైన విస్తీర్ణం కేవలం 4.28 శాతమే. అంటే కేవలం 1,970 హెక్టార్లలోనే పంటలు సాగు చేశారు. ఇందులో అత్యధిక పంట వేరుశనగ 27,015 హెక్టార్లలో సాగవ్వాల్సి ఉండగా 1,442 హెక్టార్లకే పరిమితమైంది. ఇలా అన్ని ప్రధాన పంటలు కొద్దిపాటి విస్తీర్ణంలోనే సాగయ్యాయి. అంచనా వేసిన సాధారణ విస్తీర్ణంలో 44,085 హెక్టార్ల భూమి బీడుగా మిగిలిపోయింది.
ప్రత్యామ్నాయం లేనట్లే
ఓ మోస్తారు వర్షాలు కురిస్తే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేందుకు అనువుగా ఉంటుంది. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉండడం వల్ల ప్రత్యామ్నాయ పంటలు కూడా సాగు కాని పరిస్థితి నెలకొంది. సాధారణంగా జూలై తరువాత ప్రత్యామ్నాయ పంటగా ఉలవలను సాగు చేయాలని ప్రభుత్వం వాటిని పంపిణీ చేస్తుంది. అయితే ఆగస్టు వరకు వర్షాలే లేనప్పుడు ప్రత్యామ్నాయ పంటలు ఎలా సాగుతాయి అన్నది ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల్లో పంటల సాగుపై ఆశలు పెట్టుకోవడం ఇబ్బందికరంగానే ఉంటుంది. ప్రత్యా మ్నాయ పంటలు కూడా సాగు చేయలేనంత దుర్భిక్ష పరిస్థితి ఈ ఖరీఫ్ లో నెలకొంది. జిల్లాలో 2024 ఖరీఫ్‌లో 19 మండలాలు, 2025 ఖరీఫ్‌లో 9 మండలాలను కూటమి ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించింది. అయితే ప్రస్తుతం జిల్లా అంతటా కరువు పరిస్థితులు నెలకొన్నాయి.
● ఎల్‌నినో దెబ్బకు ఖరీఫ్ ఖతం
● 46,055 హెక్టార్లకు.. సాగైంది 1,970 హెక్టార్లలోనే
● ఖరీఫ్ చరిత్రలోనే దారుణమైన పరిస్థితి
● బీడుగా 44,985 హెక్టార్లు
రూ.7 లక్షలతో సాగు చేశా
వర్షాలను నమ్ముకుని మూడున్నర ఎకరాల్లో రూ.7 లక్షలు ఖర్చు చేసి ఖరీఫ్‌లో టమాట సాగు చేస్తున్నా. సకాలంలో వర్షాలు కురిస్తే పంట, పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. లేనిపక్షంలో పంటసాగుకు నీళ్లలేక ఎండిపోక తప్పదు. దేవుడిపై భారం వేసి పంటలవైపు చూసుకొంటున్నా.
–సుధాకర్‌రెడ్డి, టమాట రైతు, తంబళ్లపల్లె
పంట పోయినట్టే
నెల క్రితం వర్షానికి రెండున్నర ఎకరాల్లో వేరుశనగ సాగు చేశా. విత్తనం వేసిన తర్వాత చినుకు జాడలేదు. కళ్లముందే పంట ఎండిపోయింది. ఇప్పుడు వర్షం కురిసినా పంట పండదు, దిగుబడి రాదు. పెట్టిన పెట్టుబడి, కష్టం నష్టపోవడం తప్ప మరో మార్గం లేదు. వర్షాలు కురిసి పంటలు సాగయ్యే పరిస్థితులు లేవు. ప్రభుత్వం పంట సాగు చేసిన రైతులకు పరిహారం చెల్లించాలి.
–గౌతం కుమార్ రెడ్డి, చెన్నామర్రి రైతు, కురబలకోట


