సాక్షి, మదనపల్లె : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో పార్టీ అనుబంధ విభాగాల పదవుల్లో జిల్లాకు చెందిన పలువురు నేతలను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా లింగం వాణి (కోడూరు), రైతు విభాగం జిల్లా ఉపాధ్యక్షులుగా కాకులారం భాస్కర్ రెడ్డి (పీలేరు), రైతు విభాగం జిల్లా కార్యదర్శిగా కరిమిరెడ్డి నిరంజన్ రెడ్డి (రాయచోటి), ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శిగా కొప్పుల బాలాజీ (రాయచోటి), రజక విభాగం రాజంపేట నియోజకవర్గ అధ్యక్షుడిగా పెనగలూరు రాజా, చిన్నమండ్యం మండల కార్యదర్శిగా బెల్లం చక్రపాణి రెడ్డి నియమితులయ్యారు.
ఏర్పాట్ల పరిశీలన
మదనపల్లె టౌన్ : ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు మదనపల్లె పర్యటన నేపథ్యంలో గురువారం కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్, ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో కలిసి సభా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం పాల్గొనే బహిరంగ సభా వేదిక, కార్యకర్తల సమావేశ ప్రాంగణం, వాహ నాల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. అలా గే వెంకటమ్మ చెరువులో నిర్వహించనున్న ‘జలధార’ కార్యక్రమానికి సంబంధించిన పనుల పురోగతిని అధికారులు అడిగి తెలుసుకున్నారు. కాగా సీఎం పర్యటన ఎప్పుడనేది అధికారికంగా ఇంకా ఖరారు కాలేదు.
జిల్లా సైన్సు అధికారిగా శ్రీధర్‌కుమార్
మదనపల్లె సిటీ : జిల్లా సైన్సు అధికారిగా జి.శ్రీధర్‌కుమార్‌ను నియమించినట్లు డీఈఓ సుబ్రమణ్యం తెలిపారు. పెద్దమండ్యం మండలం గుర్రంవాండ్లదపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులుగా శ్రీధర్ పనిచేస్తున్నారు. గురువారం ఆయన డీఈఓను మర్యాదపూర్వకంగా కలిసి అభినందలు తెలియజేశారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో సైన్సు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
ఆకతాయిల కట్టడికి
డ్రోన్ నిఘా
మదనపల్లె టౌన్ : విద్యాసంస్థల వద్ద విద్యార్థినులను వేధించే ఆకతాయిల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా ముమ్మరం చేశారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా స్కూళ్లు, కళాశాలల వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా మదనపల్లె పట్టణంలో ప్రతిరోజూ డ్రోన్ కెమెరాలతో ఆకాశ మార్గం నుంచి పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. డ్రోన్లతో పాటుగా మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన ’శక్తి’పోలీస్ టీమ్స్ కూడా స్కూళ్లు, కళాశాలల వద్ద నిరంతరం గస్తీ తిరుగుతున్నాయి. ఆకతాయిలు ఎవరైనా విద్యార్థినులను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని, వెంటనే డయల్–112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌న్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
దరఖాస్తుల ఆహ్వానం
మైదుకూరు : మైదుకూరు మండలం వనిపెంటలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేసేందుకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ వి.నిర్మల ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాల మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులకు అధ్యాపకులుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 22 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం వనిపెంటలోని గురుకుల పాఠశాల, కళాశాలలో సంప్రదించాలని ప్రిన్సిపల్ తెలిపారు.
గడుపు పొడిగింపు
కడప అగ్రికల్చర్ : జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వాతావరణ ఆధారిత బీమా కింద ప్రీమియం చెల్లింపునకు ఈ నెల 24 వరకు గడువు పొడించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణేశ్వరావు తెలిపారు. ప్రీమియం చెల్లింపునకు ఈ నెల 15తో ముగిసిన గడువును రైతుల విజ్ఞప్తి వరకు పొడిగించినట్లు వివరించారు. ఇందులో పత్తి, వేరుశనగ, అరటి, చీని పంటలకు సంబంధించిన ప్రీమియం చెల్లింపుకు అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


