నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు చర్యలు

Jul 17 2026 1:04 AM | Updated on Jul 17 2026 1:04 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : జిల్లాలో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ముత్యాల రామగోవిందరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన జెడ్పీ స్టాండింగ్‌ కమిటీల సమావేశంలో నీటి ఎద్దడిపై ఆయన సమీక్షించారు. ప్రజలకు తాగునీరు అందించేందుకు తొలుత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లాలో వీరబల్లి, సుండుపల్లె, చక్రాయపేట మండలాల్లోని 40 గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ ఏడుకొండలు తెలిపారు. సుమారు 180 మీటర్ల లోతులో భూగర్భ జలం ఉందన్నారు. అందుకే బోర్ల లోతు పెంచుతున్నామన్నారు. దువ్వూరు మండలంలోని చింతకుంట చెరువు నింపగలిగితే పలు గ్రామాలకు తాగునీరు అందించవచ్చన్నారు. దీనిపై చైర్మన్‌ మాట్లాడుతూ తెలుగుగంగలో అంతర్భాగమైన ఎస్‌ఆర్‌–1లో నీరు లేదన్నారు. శ్రీశైలం, వెలుగోడు నుంచి నీరు వస్తేనే చెరువులు నింపగలుగుతామన్నారు. వరికుంట గ్రామంలో తాగునీరు సరఫరా చేయాలని కాశినాయన మండల జెడ్పీటీసీ సత్యంరెడ్డి కోరారు. తహసీల్దార్‌ కార్యాలయం పక్కన బోరు ఎండిపోయి తాగునీటికి ప్రజలు అవస్థలు పడుతున్నారని పెనగలూరు జెడ్పీటీసీ పెద్ద సుబ్బరాయుడు తెలిపారు. బక్కన్నగారిపల్లె బీసీ కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. దప్పేపల్లె దళితవాడ, ఎం.దళితవాడలో బోర్లు వేశాక నీళ్లు పడ్డాయని, ఇక మోటార్లు ఏర్పాటు చేయాలని లక్కిరెడ్డిపల్లె జెడ్పీటీసీ కోరారు. శెట్టిపల్లె తూర్పుపల్లెలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కొత్త బోరు ఏర్పాటు చేయాలని సంబేపల్లె జెడ్పీటీసీ కోరారు.

ఆరుతడి పంటలు వేసుకోవాలి

ఎల్‌నినో నేపధ్యంలో శ్రీశైలం నీటి విడుదల పరిస్థితి ఏంటని జెడ్పీ చైర్మన్‌ కేసీ కెనాల్‌ కడప జేఈని ప్రశ్నించారు. అందుకు జేఈ బదులిస్తూ జిల్లాలో 92 వేల ఎకరాల కేసీ ఆయకట్టు ఉందని పేర్కొన్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో కేవలం 45 టీంఎసీలు ఉన్నాయని తెలిపారు. అందుకే రైతులను ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని సూచిస్తున్నామని పేర్కొన్నారు.

● ఖాజీపేట బైపాస్‌ వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్డు చాలా అధ్వానంగా ఉందని, మరమ్మతులు నిర్వహించాలని పలుమార్లు కోరినా అధికారులు స్పందించకపోవడంపై జెడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు అచ్చుకట్ల కరీముల్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

● చిలమకూరు–కోనాపురం మధ్య ఏడు కిలోమీటర్ల రహదారి మంజూరైందని, పనులు వెంటనే చేపట్టాలని ఎర్రగుంట్ల జెడ్పీటీసీ బాలయ్య కోరారు. సీతారాంపురం వెళ్లాలంటే ఘాట్‌రోడ్డులో ప్రయాణించాల్సి వస్తుందని, అందుకు తగ్గట్లు బస్సులు కండీషన్‌లో లేవని పోరుమామిళ్ల జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్‌ అన్నారు. ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందన్నారు.

● ప్రొద్దుటూరుకు బస్సుల సంఖ్య పెంచాలని కో ఆప్షన్‌ సభ్యులు కోరారు. కడప–వేంపల్లె మధ్య బస్సులు ఏర్పాటు చేయాలని జెడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి కోరారు.

● గనులు భూగర్బశాఖపై జరిగిన చర్చలో చైర్మన్‌ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా సుమారు రూ. 50 కోట్లు సెస్సు రూపంలో జెడ్పీకి రావాల్సి ఉందన్నారు. ఒక మండలంలోని ఒక గ్రామంలో ఎంతమంది చదువు నేర్చుకున్నారో పేర్లతోసహా తనకు ఇవ్వాలని వయోజన విద్య డీడీని చైర్మన్‌ ఆదేశించారు. పీఎంజీఎస్‌వై, నాబార్డు పనులకు బిల్లులు వస్తున్నాయా? అంటూ చైర్మన్‌ ఆరా తీశారు. ఉపాధి హామి, పీఎంజీఎస్‌వైలో నిధులు పుష్కలంగా ఉన్నాయని, వాటిని ఉపయోగించి రహదారుల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని జెడ్పీ సీఈఓ సుబ్రమణ్యం సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షులు బాలయ్య, పలువురు జెడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

జెడ్పీ చైర్మన్‌ రామగోవిందరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement