ములకలచెరువు: ములకలచెరువుకు ఆనుకొని ఉన్న కనుగొండకు గుర్తు తెలియని వ్యక్తులు గురువారం నిప్పు పెట్టారు. దీంతో మంటలు వ్యాపించి చెట్లు కాలిపోయాయి. సుమారుగా వంద ఎకరాల్లో అడవి మంటలకు దహించిపోతోంది. ఎగసిపడిన మంటలు, వ్యాపించిన దట్టమైన పొగతో పెద్దపాళ్యం, అంగజాలపల్లె, పాతములకలచెరువు, వడ్డిపల్లెలకు పొగ అలు ముకుంది. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంటలను ఆర్పే పనిలో ఫైర్, అటవీశాఖ అధికారులు నిమగ్నమయ్యారు.
నూనె మీదపడి
యువకుడికి తీవ్ర గాయాలు
మదనపల్లిటౌన్: వంట చేస్తుండగా వేడినూనె మీదపడి యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన బి కొత్తకోట మండలంలో జరిగింది. గురువారం ఉదయం బడికాయలపల్లికి చెందిన వెంకటరమణ కుమారుడు జె.కిరణ్(30) ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు వేడి నూనె మీద పడింది. కుటుంబీకులు గమనించి బాధితుడిని 108లో స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు చికి త్సలు చేశారు.
జీపీఎస్ దారి తప్పింది
– బైక్ ప్రమాదంలో
దంపతులకు తీవ్ర గాయాలు
మదనపల్లెటౌన్: జీపీఎస్ లోకేషన్ చూస్తూ తిరుపతి నుంచి మదనపల్లెకు బైక్‌లో వస్తున్న దంపతులకు జీపీఎస్ దారి తప్పించడంతో ప్రమాదానికి గురైన ఘటన గురువారం మండలంలోని శానిటోరియం వద్ద జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు. తిరుపతికి చెందిన దంపతులు ఆనంద్ (25), నాగలక్ష్మి (20) కుమారుడు అభి(5)తో కలసి మదనపల్లెలో జరుగుతున్న బంధువుల పెళ్లికి బైక్‌లో బయలుదేరారు. వీరు మదనపల్లె సమీపంలోని శానిటోరియం వద్దకు రాగానే రోడ్డు అభివృద్ధి పనులు సాగుతున్నాయి.దీంతో రోడ్ డైవర్షన్ ఉంది. జీపీఎస్ ఈ డైవర్షన్‌ను చూపకపోవడంతో నేరుగా చర్చి వైపు రోడ్డులోకి రావడంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్సలు అందించారు. తాలూక పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరికి తీవ్రగాయాలు
మదనపల్లెటౌన్: ద్విచక్ర వాహనాలు ఎదురెదురు ఢీకొనడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డ సంఘటన గురువారం రాత్రి కురబలకోట మండలంలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. నిమ్మనపల్లె మండలం, పిట్టావాండ్లపల్లెకు చెందిన జగదీష్(26) సొంతపనిపై బైక్‌లో అంగళ్లుకు బయలుదేరాడు. మదనపల్లె మండలం, సీటీఎంకు చెందిన మల్లికార్జున (30) ద్విచక్రవాహనంలో అంగళ్లు నుంచి మదనపల్లెకు వస్తుండగా, అంగళ్లు బైపాస్ రోడ్డులో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని 108లో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. వైద్యులు వారికి చికిత్సలు అందించారు. ముదివేడు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


