ఇసుక తవ్వుతున్న జేసీబీ స్వాధీనం
నిమ్మనపల్లె : మండలంలో అనుమతి లేకుండా ఇసుక తవ్వకాలు జరుపుతున్న జేసీబీని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. మంగళవారం నిమ్మనపల్లె సమీపంలోని అగ్రహారం రోడ్డులో బహుదా పరీవాహక ప్రాంతంలోని కట్ట సమీపంలో ముష్టూరుకు చెందిన జేసీబీ ఇసుక తవ్వుతున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి వెళ్లి వాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అనంతరం వాహన యజమాని బాబును స్టేషన్‌కు పిలిపించి హెచ్చరించి బైండోవర్ కేసు నమోదు చేశామన్నారు. కాగా, మండలంలో ఇసుకాసురులు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ ముందుగా జేసీబీ వాహనాలతో ఇసుకను తవ్వి కుప్పలుగా వేస్తారు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా కూలీలతో ట్రాక్టర్‌లకు నింపుకొని మదనపల్లె పరిసర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.


