క్షయవ్యాధి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం
రాయచోటి జగదాంబసెంటర్ : అన్నమయ్య జిల్లాను క్షయ వ్యాధి రహితంగా రూపొందించడమే లక్ష్యంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ‘‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’’ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ క్షయ వ్యాధి పట్ల శ్రద్ధ వహించాలన్నారు. టీబీ రహిత భారత్‌కు సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రాథమిక దశలోనే టీబీ వ్యాధిని గుర్తించి చికిత్స చేయడం, క్షయ వ్యాధి వలన కలిగే మరణాలను తగ్గించడం, 2027 సంవత్సరం నాటికి భారతదేశంలో క్షయ వ్యాధిని నిర్మూలించడం లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
ఉదారత చాటుకున్న కలెక్టర్, జేసీ..
జిల్లాలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్‌లు ఒక్కొక్కరు ముగ్గురు క్షయ వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకొని వారి పోషకాహార కోసం తమ సొంత నిధులు రూ.10 వేలు అందించారు. డీఆర్‌ఓ మధుసూదనరావు, ఆర్డీఓ శ్రీనివాసులు ఒక్కొక్కరు ఇద్దరి చొప్పున దత్తత తీసుకుని రూ.5 వేలు అందించారు. జిల్లా అధికారులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వంతుగా తోచిన మేరకు ఆర్థిక సహాయం అందించి క్షయ రహిత జిల్లా కోసం కృషి చేయాలని కలెక్టర్ కోరారు. అనంతరం క్షయ వ్యాధి నిర్మూలనపై అవగాహన నిమిత్తం రూపొందించిన ప్రచార పోస్టర్లను జేసీ, డీఆర్‌ఓ, ఆర్డీఓ, వైద్యశాఖ అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్‌ఓ డాక్టర్ శైలజ, వైద్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ చామకూరి శ్రీధర్


