బాధితులకు న్యాయం చేయాలి
రాయచోటి: ప్రజా వేదిక ద్వారా అందుతున్న ప్రజా సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించాలని జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి అర్జీలను స్వీకరించి, వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడి సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలని, తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపించాలని ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు. రాయచోటి టౌన్‌కు చెందిన వికలాంగురాలు కాత్యాయని సమ్యను చెప్పుకునేందుకు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్పీ ఆమె వద్దకే వెళ్లి సమస్యను విన్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి చట్ట పరిధిలో ఆమె సమస్యను పరిష్కరించాలని రాయచోటి అర్బన్ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు.


