‘స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర’ పకడ్బందీగా నిర్వహించాలి
రాయచోటి: 17న స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ప్రతి నెల మూడో శనివారం నిర్వహించాల్సిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల నిర్వహణ, తాగునీరు, ఉపాధి హామీ, పల్లె పండుగ పనుల ప్రగతిపై అధికారులతో వీసీ నిర్వహించారు. జిల్లాను చెత్త రహితంగా రూపొందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అన్నారు.
● ప్రభుత్వం బదిలీలకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులల్లో మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా బది లీలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
● జిల్లాలో తాగునీటి ఎద్దడి ఎక్కడా రానివ్వకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. నీటి కొరత సమస్యను ముందుగానే గుర్తించి అవసరమైన ప్రతిచోట ట్యాంకర్లు ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు.
● ఉపాధిహామి పనులను కూడా పటిష్టంగా అమలు చేయాలన్నారు. లేబర్ మొబిలైజేషన్‌లో భాగంగా ప్రతి కుటుంబానికి వందరోజుల పని తప్పనిసరిగా కల్పించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్‌రాజేంద్రన్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వ్యాసరచనతో పిల్లలలో సృజనాత్మకత
వ్యాసరచన వల్ల పిల్లల్లో సృజనాత్మకత, సమాజంపట్ల అవగాహన పెంపొందుతుందని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బీట్ ద హీట్ అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో విజేతలకు కలెక్టర్ సర్టిఫికెట్లు, మెమెంటోలను, పాఠ్యపుస్తకాలను అందజేశారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఈనెల 15న పోటీలు నిర్వహించామని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం తెలిపారు. వ్యాసరచనలో ఐదుగురికి, చిత్రలేఖనంలో ఐదుగురికిబహుమతులు అందజేసినట్లు చెప్పారు. వ్యాసరచన పోటీల్లో రాయచోటి జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన నికిత రెడ్డి, చిత్రలేఖనంలో రాయచోటి జడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన భవ్య ప్రథమ బహుమతులు సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ శివప్రకాష్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్


