అక్రమంగా కొండను తవ్వేస్తున్నారు
జమ్మలమడుగు : పశువుల మేత కోసం వదిలిన కొండ ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించుకుని పూర్తిగా చదును చేస్తున్నారని , పైగా ఎలాంటి అనుమతులు లేకుండా సోలార్ కంపెనీ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి ఆర్డీఓ ఆదిమూలపు సాయిశ్రీకి ఫిర్యాదు చేశారు. శనివారం పెద్దముడియం మండలంలోని కొండ పాపాయపల్లి, దిగువకల్వటాల గ్రామాలకు చెందిన రైతులతో కలిసి ఆర్డీఓను కలిశారు. ఈ సందర్భంగా రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ కొండపాపాయపల్లి పంచాయతీ పరిధిలో నాగరెడ్డిపల్లె గ్రామంలోని సర్వే నంబర్ 224లో నంద్యాల, కడప జిల్లా ప్రాంతాలకు చెందిన రైతులు పశువులను మేపుకునేందుకు వస్తుంటారని తెలిపారు. రబీ, ఖరీఫ్ సీజన్‌లో ఈ ప్రాంతంలో పూర్తిగా పంటలు వేసుకుంటారన్నారు. పశువుల మేత కోసం అన్ని వర్గాల ప్రజలకు ఈ కొండనే ఆధారంగా నిలిచిందని చెప్పారు. అలాంటి కొండను సోలార్ కంపెనీ కోసం పూర్తిగా చదును చేస్తున్నారన్నారు. కల్వటాల గ్రామానికి చెందిన రైతుల పట్టా భూముల్లో రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా పనులు చేసి వదిలేశారన్నారు. వారు వేసిన సిమెంట్ దిమ్మెలను తొలగించాలంటే రైతులకు లక్షల రూపాయలలో ఖర్చు అవుతుందన్నారు. వారికి న్యాయం జరిగే విధంగా అధికారులు సోలార్ కంపెనీ ద్వారా హామీ ఇప్పించాలని కోరారు. అధికారులు ఒకవైపు అనుమతులు ఇవ్వలేదని చెబుతున్నారు. అక్కడ పనులు మాత్రం వేగంగా జరుగుతున్నాయన్నారు. అధికారులు ఇప్పటికై నా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ విష్ణువర్దన్‌రెడ్డి, కొండపాపాయపల్లె నాయకుడు వెంకటసుబ్బారెడ్డి, కల్వటాల నాయకుడు శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


