అయ్యో అనూషా.. ఎంత పని చేశావమ్మా?

- - Sakshi

అన్నమయ్య : అత్తింటి ఆరళ్లకు ఓ అబల బలైంది. మండలంలోని పొన్నూటిపాళ్యం పంచాయతీ భువనేశ్వరినగర్‌లో నివాసం ఉంటున్న అనూష అదనపు కట్నం కోసం అత్తింటివారి వేధింపులు భరించలేక సోమవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాలూకా సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. రామసముద్రం మండలం పెద్దకురప్పల్లెకు చెందిన అమ్ములు, చిన్నస్వామి కుమార్తె అనూష(22)కు కర్ణాటకలోని రాయల్పాడు మండలం శునకల్‌ ప్రాంతానికి చెందిన అశోక్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది.

భార్యాభర్తలిద్దరూ వివాహం తర్వాత భువనేశ్వరినగర్‌లో నివాసం ఉంటున్నారు. వివాహ సమయంలో అనూషా తల్లిదండ్రులు అశోక్‌కు రూ.2 లక్షల నగదు, 150 గ్రాముల బంగారు ఇచ్చి వివాహం చేశారు. అలాగే కారు తీసుకోవాలంటే రూ.2 లక్షలు ఇచ్చారు. ఇది చాలక మళ్లీ అదనంగా డబ్బు కావాలని భర్త అశోక్‌, అత్తామామలు రెడ్డెమ్మ, కృష్ణప్పలు వేధింపులకు గురిచేస్తుండటంతో సోమవారం రాత్రి అనూష ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన భర్త వెంటనే ఆమెను కిందకు దించి మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రికి చేరేటప్పటికే మృతి చెందడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అనూష మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రి వద్దకు చేరుకుని విగతజీవిగా పడి ఉన్న కూతురిని చూసి దుఃఖసంద్రంలో మునిగిపోయారు. తమ కుమార్తె అదనపు కట్నం తేలేదని అత్తింటివారే తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరకట్న వేధింపులతోనే తమ బిడ్డ చనిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మదనపల్లె డీఎస్పీ కేశప్ప ఆస్పత్రి వద్దకు చేరుకుని ఇరు వర్గాల వారిని విచారణ చేశారు. అనూష తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త అశోక్‌, అత్తామామలపై వరకట్న కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ సుధాకర్‌ తెలిపారు.

Read latest Annamayya News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top