త్వరలో శ్రీవారి ఆర్జిత సేవలు

YV Subbareddy says TTD Srivari Arjitha Seva Soon - Sakshi

రూ.3,096.40 కోట్లతో టీటీడీ బడ్జెట్‌కు ఓకే 

రూ. 25 కోట్లతో ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు 

తిరుమలలో త్వరలో హోటళ్లు తొలగింపు.. ముఖ్య కూడళ్లలో ఉచితంగా అన్న ప్రసాదాలు 

అలిపిరి వద్ద 50 ఎకరాల్లో ఆధ్యాత్మిక సిటీ నిర్మాణం 

శ్రీవారి ఆలయ మహాద్వారం, బంగారు వాకిలి, గోపురానికి బంగారు తాపడం 

టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి వెల్లడి

తిరుమల: శ్రీవారి ఆర్జిత సేవలు పునరుద్ధరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్‌ నిబంధనలను సడలించడంతో ఆర్జిత సేవలను సడలించింది. సర్వ దర్శనం, శీఘ్ర దర్శనం టికెట్ల సంఖ్య క్రమంగా పెంచాలని నిర్ణయించింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి రూ.3,096.40 కోట్ల అంచనాలతో రూపొందించిన టీటీడీ బడ్జెట్‌ను ఆమోదించింది. తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో బడ్జెట్‌ ఆమోదంతో పాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు. సామాన్య భక్తులకు కేటాయించే ఆర్జిత సేవా టికెట్ల ధరలు పెంచినట్లు జరిగిన ప్రచారం ఆవాస్తవమని చెప్పారు. ఆయన తెలిపిన వివరాలు.. 

► సీఎం వైఎస్‌ జగన్‌ సూచనల మేరకు రూ.230 కోట్లతో శ్రీ పద్మావతి చిన్న పిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం. త్వరలో సీఎం జగన్‌చే భూమిపూజ. రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయం. 
► తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని నిర్ణయం. 
► టీటీడీ ఉద్యోగులు, పెన్షనర్లకు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యానికి రూ.25 కోట్లతో నిధి ఏర్పాటు. 
► తిరుచానూరు సమీపంలోని శ్రీ పద్మావతి నిలయాన్ని బాలాజీ జిల్లా కలెక్టరేట్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీ నిబంధనల మేరకు లీజుకు ఇవ్వాలని నిర్ణయం. 
► తిరుమల మాతృశ్రీ తరిగొండ అన్న ప్రసాద భవనంలో స్టీమ్‌ ద్వారా అన్నప్రసాదాలు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం గ్యాస్, డీజిల్‌ ద్వారా కేజి స్టీమ్‌ తయారీకి రూ.4.71 ఖర్చవుతోంది. సోలార్‌ సిస్టమ్‌ ద్వారా రెస్కో మోడల్‌ స్టీమ్‌ను కేజి రూ.2.54కు 25 సంవత్సరాల పాటు సరఫరా చేయడానికి నెడ్‌క్యాప్‌తో ఒప్పందం. తద్వారా టీటీడీకి ఏడాదికి దాదాపు రూ.19 కోట్ల ఆదా. 
► తిరుమలలో హోటళ్లు, ఫాస్టు ఫుడ్‌ సెంటర్లు తొలగించి, అన్ని ముఖ్య కూడళ్లలో ఉచితంగా అన్న ప్రసాదాలు అందించాలని నిర్ణయం. అత్యున్నత స్థాయి నుంచి సామాన్య భక్తుడి వరకు ఒకే రకమైన ఆహారం అందిస్తారు. ఇక్కడి వ్యాపారులకు ఇతర వ్యాపారాలు చేసుకోవడానికి లైసెన్స్‌లు ఇస్తారు. 
► అలిపిరి వద్ద సైన్స్‌ సిటీకి మంజూరు చేసిన 70 ఎకరాల్లో 50 ఎకరాలు వెనక్కు తీసుకుని ఆధ్యాత్మిక నగరం నిర్మాణం. ఈ పనులకు త్వరలో ముఖ్యమంత్రితో శంకుస్థాపన. ఇందులో సంప్రదాయ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పురాణాల లైవ్‌ షోలు వంటివి ఉండనున్నాయి. 
► అన్నమయ్య మార్గాన్ని త్వరలో భక్తులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయం. అటవీ శాఖ అనుమతులు లభించిన తరువాత పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు 
► టీటీడీ ఆయుర్వేద ఫార్మసీకి రూ.3.60 కోట్లతో పరికరాలు కొనుగోలు. రాష్ట్రవ్యాప్తంగా ఆయుర్వేద మందులు అందుబాటులోకి. 
► శ్రీవారి ఆలయ మహాద్వారం, బంగారు వాకిలి, గోపురానికి బంగారు తాపడం చేయించాలని నిర్ణయం. క్రేన్‌ సాయంతో గోపురం బంగారు తాపడంపై ఆగమ పండితులతో చర్చించాలని అధికారులకు ఆదేశం. 
► పాలక మండలి సమావేశంలో టీటీడీ ఈవో డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌ రెడ్డి, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణి మోహన్, కమిషనర్‌ హరి జవహర్‌లాల్, అదనపు ఈవో ఎ.వి. ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, పోకల ఆశోక్‌ కుమార్, సనత్‌కుమార్, మారుతీ ప్రసాద్, కాటసాని రాంభూపాల్‌ రెడ్డి,  మధుసూదన్‌ యాదవ్, సంజీవయ్య, విశ్వనాథ్, శ్రీ రాములు, విద్యాసాగర్, మల్లీశ్వరి, శివకుమార్, ఢిల్లీ, చెన్నై  స్థానిక సలహా మండళ్ల అధ్యక్షులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, శేఖర్‌ రెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో గోపినాథ్‌ జెట్టి  తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన ధర్మ ప్రచార పరిషత్‌ కార్యనిర్వాహక మండలి సమావేశంలో శ్రీనివాస వ్రత విధానం పుస్తకాలు ముద్రించి భక్తులకు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top