గుంటూరులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్‌సీపీ, నవ్యాంధ్ర ఎమ్మార్పి ఎస్, దళిత నాయకులు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసనలు
చంద్రబాబు పాలనలో దళితులపై దాడులు,
దౌర్జన్యాలు, హత్యలు నిత్యకృత్యంగా మారాయని నాయకుల ఆగ్రహం
సాల్మన్ హంతకులను కఠినంగా శిక్షించాలి..
బాధిత కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్
హంతకులను ఇంకా అరెస్టు చేయకపోవడంపై మండిపాటు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త మందా సాల్మన్ హత్యపై రాష్ట్రవ్యాప్తంగా దళితులు భగ్గుమన్నారు. టీడీపీ మూకలు పథకం ప్రకారం మందా సాల్మన్‌ను హత్య చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శనివారం అన్ని జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాల ఎదుట పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేశారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు జరిగిన ఈ నిరసనల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతోపాటు దళితులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
చంద్రబాబు రెడ్‌బుక్ పాలనలో రాష్ట్రంలోని దళితులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు నిత్యకృత్యంగా మారాయని నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. సాల్మన్ హంతకులను కఠినంగా శిక్షించాలని, ఆయన కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాకుండా మంత్రి నారా లోకేశ్ రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ దళితులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులను దారుణంగా హత్య చేస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉంటున్నారనే దళితులను లక్ష్యంగా చేసుకుని దారుణాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
టీడీపీ మూకల రక్తదాహానికి మందా సాల్మన్ బలయ్యారని, ఇది ముమ్మాటికి చంద్రబాబు ప్రభుత్వం చేయించిన హత్యేనని స్పష్టం చేశారు. హంతకులను ఇంకా అరెస్టు చేయకపోవడంపై మండిపడ్డారు. తక్షణమే నిందితులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, వారికి కొమ్ముకాసిన టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, సీఐ, ఎస్‌ఐలపై ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని నినదించారు. దళితులపై దాడులకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమిస్తామని ప్రకటించారు. వివిధ ప్రాంతాల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు దళిత నాయకులు వినతి పత్రాలు సమర్పించారు.
పలు ప్రాంతాల్లో ర్యాలీలు.. నల్లరిబ్బన్లతో నిరసనలు
సాల్మన్ హత్యకు నిరసనగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లా అమలాపురం మండలం బొంతువారిపేట నుంచి ఈదరపల్లి వంతెన వరకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు, దళితులు ర్యాలీ నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేసేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నాయకులు, దళితులను పోలీసులు అడ్డుకున్నారు.ఈ కార్యక్రమానికి ముందస్తు అనుమతి లేదని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే కేసులు పెడతామని బెదిరించారు.
కడపలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సర్కిల్‌లో వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు కట్టుకుని ధర్నా చేశారు. కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. నల్ల రిబ్బన్లు ధరించి చంద్రబాబు డౌన్..డౌన్, జోహార్ అంబేడ్కర్... జైభీమ్.. పోలీసుల జులుం నశించాలి.. దళితులపై దాడులు అరికట్టాలి... రెడ్ బుక్ రాజ్యాంగం నశించాలి.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బాపట్లలోనూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు, దళితులు ర్యాలీ నిర్వహించారు.


