తంబళ్లపల్లెలో సంక్షేమ యాత్ర  | Sakshi
Sakshi News home page

తంబళ్లపల్లెలో సంక్షేమ యాత్ర 

Published Sat, Nov 11 2023 5:50 AM

YSRCP Samajika Sadhikara Yatra Public Meeting in Thamballapalle - Sakshi

బి.కొత్తకోట: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన చర్యల ఫలితం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో ప్రతిబింబించింది. శుక్రవారం నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార యాత్రకు బడుగు, బలహీన వర్గాల ప్రజలు వెల్లువెత్తారు. సీఎం జగన్‌ తమకు చేసిన మేలును వివరిస్తూ యాత్రలో సాగారు. పీటీఎం నుంచి మద్దయ్యగారిపల్లె వరకు పాదయాత్ర సాగింది. అనంతరం ములకలచెరువులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో పెద్ద ఎత్తున పాల్గొని, జై జగన్‌ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన మేలును మంత్రులు, నాయకులు వివరించారు.   

సామాజిక సాధికారతను నిజం చేసిన సీఎం జగన్‌: మంత్రి మేరుగు 
ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకూ మేలు చేసి ప్రతి గుండెలో సీఎం వైఎస్‌ జగన్‌ ఉన్నారని మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. జ్యోతిరావు పూలే, అంబేడ్కర్‌ కలలుగన్న సామాజిక సాధికారతను సీఎం జగన్‌ ఆచరణలో నిజం చేస్తున్నారని అన్నారు. దేశ ప్రధానులకే సాధ్యంకాని సామాజిక విప్లవానికి సీఎం వైఎస్‌ జగన్‌ నాంది పలికారని అన్నారు. చంద్రబాబు 2014లో 645 హామీలతో గెలిచి ప్రజలను మోసం చేశారన్నారు. 2024లో మరోసారి  మోసం చేసేందుకు బాబు వస్తున్నారని, ప్రజలు మోసపోవద్దని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆర్థికంగా, రాజకీయంగా మరింతగా ఎదగడానికి సీఎం జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు.  

జగన్‌తోనే స్వాతంత్య్రం: మంత్రి గుమ్మనూరు జయరాం 
75 ఏళ్ల స్వాతంత్య్ర చరిత్రలో సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్వాతంత్య్రం వచ్చిందని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. బీసీల్లోని అన్ని వర్గాలకు సీఎం జగన్‌ అండగా నిలుస్తున్నారని చెప్పారు. జగన్‌ అనే శక్తి లేకపోతే, పార్టీ పెట్టకపోతే ఈ మార్పు ఉండేది కాదని అన్నారు.  

స్కీం సీఎం జగన్‌ : మంత్రి ఉషశ్రీ చరణ్‌ 
ఏపీలో స్కీం సీఎం జగన్‌ అయితే స్కాం సీఎం చంద్రబాబు అని మంత్రి ఉషశ్రీ చరణ్‌ అన్నారు. మహిళలను కార్పొరేషన్‌ చైర్మన్లు చేసిన ఘనత జగన్‌దేనని చెప్పారు. కనకదాస్, వాల్మికి జయంతిని అధికారికంగా నిర్వహించి గౌరవం పెంచారన్నారు. 
టీడీపీ నేతల మాటలు ఎవరూ 

వినడంలేదు: మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ 
చంద్రబాబును స్థానిక ఎన్నికల్లో సొంత జిల్లా చిత్తూరు ప్రజలే తిప్పికొట్టారని, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ,బీసీలు మైనార్టీలంతా వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ పేర్కొన్నారు. నెల్లూరు గడ్డపై ఓ బీసీకి టికెట్‌ ఇచ్చి రెండుసార్లు గెలిపించి మంత్రిగా చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. కష్టంతో పాలు పోసిన వారి ఆదాయంతో చంద్రబాబు హెరిటేజ్‌ ఆస్తులు పెరిగాయని అన్నారు. ఎన్నికల్లో కిలో బంగారం, బెంజి కారు ఇస్తామని చెబుతారని, అలాంటి వారి మాటలకు మోసపోవద్దని కోరారు. సామాజిక సాధికార యాత్రలో నల్ల రిబ్బన్లతో నిరసనలు తెలపాలని టీడీపీ నేతలంటున్నారని, వారి మాటలు ఎవరూ వినడంలేదని చెప్పారు.

Advertisement
Advertisement