మదనపల్లెటౌన్ : నిరుద్యోగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన గురువారం చౌడేపల్లె మండలంలో వెలుగుచూసింది. ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప కథనం మేరకు.. మండలంలోని బోయకొండ సమీపంలో ఉన్న అప్పినేపల్లికి చెందిన రెడ్డెప్పనాయుడు కొడుకు సాయికుమార్(24) డిగ్రీ వరకు చదివాడు. ఉద్యోగం లేక కొంత కాలంగా ఇంటివద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఉద్యోగం కోసం పలు ప్రయత్నాలు చేశాడు. ప్రభుత్వం నిర్వహించిన కాంపిటీటివ్ పరీక్షలు రాశాడు. ప్రైవేట్ సంస్థల్లో ప్రయత్నించాడు. అక్కడ వచ్చిన ఉద్యోగంతో సంతృప్తి చెందక ఇటీవల మానేశాడు. దీంతో జీవితంపై విరక్తితో ఇంట్లో ఉన్న పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. కుటుంబీకులు గమనించి బాధితున్ని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అత్యవసర విభాగం డాక్టరు పరీక్షించి, ప్రథమ చికిత్సల అనంతరం అతని పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ అంబులెన్స్‌లో బెంగళూరుకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


