చల్లనికొండపై మంటలు!
● హార్సిలీహిల్స్‌లో వరుస కారు ప్రమాదాలు
● మంటలతో కాలి బూడిదైన ఒక టెంపో,
రెండు కార్లు
బి.కొత్తకోట : మండలంలోని చల్లటికొండ హార్సిలీహిల్స్‌కు విహారానికి వచ్చే సందర్శకులకు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని ఆందోళనకర పరిస్థితి నెలకొంటోంది. ఎన్నడూ జరగనన్ని ప్రమాదాలు ఇటీవల చోటుచేసుకున్నాయి. పెను ప్రమాదాలు సంభవిస్తున్నా అదృష్టవశాత్తు ప్రాణాలకు ప్రమాదం జరగడంలేదు. గాయాలతో బయటపడుతున్నారు. హార్సిలీకొండ ఘాట్‌రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతుండగా ఇటీవల కార్లు మంటలతో కాలి బూడిద అవుతున్నాయి.
టెంపో, కార్లు దగ్ధం
కొండకు జిల్లాతోపాటు సత్యసాయి, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాలు, తమిళనాడు, కర్ణాటకలకు చెందిన సందర్శకులు అధికంగా వస్తుంటారు. వీరంతా కార్లలోనే కొండపైకి చేరుకుంటారు. కాండ్లమడుగు నుంచి కొండపై 9 కిలోమీటర్ల ప్రమాదకరమైన ఘాట్‌రోడ్డులో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రమాదకరమైన మలుపుల్లో ఘాట్‌రోడ్డుపై అవగాహన ఉంటే కార్లు నడిపేందుకు ఇబ్బంది లేదు. లేకపోతే ప్రమాదాలను ఆహ్వనించినట్టే. ప్రశాంత వాతావారణంలో సేద తీరేందుకు వస్తూ ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. 2013లో ఒక టెంపో ఘాట్‌రోడ్డులో పైనుంచి కిందకు వచ్చే మొదటి మలుపు తర్వాత కాలి బూడిదైపోయింది. 2018లో కడపకు చెందిన పర్యాటకులు కారులో వస్తుండగా ఘాట్‌రోడ్డుపై కారులో మంటలు వ్యాపించడంతో కాలిపోయింది. బుధవారం పుంగనూరుకు చెందిన పర్యాటకులు కారులో రాగా కొత్త వ్యూపాయింట్ వద్ద అదుపుతప్పిన కారు కిందపడి కాలిపోయింది. ఇలాంటి ఘటనలతో పర్యాటకులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయంలో పోలీసు, రవాణా శాఖ అధికారులు స్పష్టమైన చర్యలు చేపట్టాల్సిన అసవరం ఉంది. అలాగే ఘాట్‌రోడ్డుకు ఇరువైపులా మొక్కలు, చెట్ల కొమ్మలు కమ్మేస్తున్నాయి. దీంతో దూరంగా వస్తున్న వాహనాలకు రోడ్డు కనిపించడం లేదు. వేగ నియంత్రణపై పోలీసులు నిబంధనలు అమలు చేస్తూ కఠినంగా వ్యవహరించాల్సి ఉంది.
కారు దగ్ధంపై విచారణ
బి.కొత్తకోట: మండలంలోని హార్సిలీహిల్స్‌పై బుధవారం సాయంత్రం కారు దగ్ధమైన ఘటనపై గురువారం సీఐ గోపాల్‌రెడ్డి విచారణ జరిపారు. కొత్త వ్యూపాయింట్ వద్ద వెనుక్కు తిప్పుకునే ప్రయత్నంలో కింద ఉన్న బండపైకి దూసుకెళ్లి కాలిపోయింది. పుంగనూరుకు చెందిన కారు యజమాని, కారులో వచ్చిన డ్రైవర్లను సీఐ విచారించారు. ప్రమాదం ఎలా జరిగిందన్న వివరాలను సేకరించారు.
ప్రధాన సంఘటనలు
కర్ణాటక సందర్శకులు తిరుపతి నుంచి కారులో వస్తూ కొండను ఢీకొట్టడంతో పల్టీలు కొట్టింది.
కడపకు చెందిన సందర్శకులు కారు సైలెన్సర్‌లో మంటలతో దగ్ధమైపోయింది.
మదనపల్లెకు చెందిన కారు రోడ్డుపై ఇసుక కారణంగా బోల్తా కొట్టింది.
రాత్రివేళ కొండ దిగుతున్న కారు పైప్‌లైన్ వద్ద చెట్టును ఢీకొనగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
9వ మలుపు వద్ద మదనపల్లెకు చెందిన పర్యాటకుల ఇన్నోవా లోయలోకి పడబోతూ తప్పించుకొంది. ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు.
పైప్‌లైన్ మలుపువద్ద మదనపల్లెకు చెందిన కారు ప్రమాదానికి గురై ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
గంగోత్రి వద్ద అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఇద్దరు పర్యాటకులు ప్రమాదానికి గురై గాయపడ్డారు.
వివేకానంద విగ్రహం వద్ద నిలిపి ఉంచిన క్వాలిస్ కారు దొర్లుకొంటూ లోయలోకిపడి ధ్వంసమైంది. ఇందులో ఎవరూ లేరు.
జిడ్డుకృష్ణమూర్తి సర్కిల్ వద్ద కారు నిలిపివుంచినా అది కాటేజీవైపు దూసుకెళ్లి చెట్టును ఢీకొంది. ఇందులో ఎవరూ లేరు.
తొలి ఘాట్‌మలుపులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
గంగోత్రివద్ద కర్ణాటక కారు ప్రమాదంలో ఇద్దరు సందర్శకులు గాయపడ్డారు.
బెంగళూరు నుంచి వస్తున్న కారు–ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగినా ఎవరికి గాయాలు కాలేదు.
రెండోఘాట్ మలుపులో కారు, ద్విచక్ర వాహనం ఢీకొని ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
గంగోత్రి సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు.
తిరుమల ఎత్తు ఘాట్‌వద్ద తమిళనాడుకు చెందిన కారు అదుపుతప్పి లోయలో పడింది.
గంగోత్రి–రెండో ఘాట్ మధ్యలో కారు అదుపుతప్పి కొండను ఢీకొంది.


