మదనపల్లెటౌన్ : రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం కురబలకోట మండలంలో జరిగింది. ఎసై మధురామచంద్రడు తెలిపిన వివరాలు.. వాల్మీకిపురం మండలం, పత్తేపురానికి చెందిన అన్నదమ్ములు పురుషోత్తం(26), మణికంఠ(21) బైక్‌లో బి.కొత్తకోట మండలం, కాండ్లమడుగు క్రాస్‌లో ఉన్న తన సోదరి లక్ష్మీని చూసి రావడానికి బయలుదేరారు. కురబలకోట మండలం, అంగళ్లు సమీపానికి రాగానే ఎదురుగా వస్తున్న ఓ కారు వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో అన్నదమ్ములు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి, బాధితులను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలు కుంటూ ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉందని ఎస్‌ఐ తెలిపారు.
ద్విచక్రవాహనం ఢీకొని..
మదనపల్లెటౌన్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం కురబలకోట మండలంలో జరిగింది. ములకలచెరువు పోలీసుల కథనం మేరకు.. సత్యసాయి జిల్లా, తనకల్లు మండలం, కొట్టువారిపల్లెకు చెందిన లక్ష్మి(45), అమె భర్త బాబు తో కలసి ములకలచెరువు మండలంలోని బురకాయలకోట వద్ద రోడ్డు పక్కన గురిజి ఏరుకుంటూ ఉండగా మదనపల్లెకు చెందిన స్కూటరిస్టు రామాంజులు బైకు వీరిని ఢీకొంది. ఈ ప్రమాదంలో లక్ష్మీ తీవ్రంగా గాయపడింది.రామాంజులు సైతం తీవ్రంగా గాయపడ్డాడు. బాధితులను స్థానికులు చికిత్స కోసం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి లక్ష్మి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పడంతో, కుటుంబీకులు ఆమెను తిరుపతి రుయాకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బైక్ అదుపుతప్పి కిందపడి..
మదనపల్లెటౌన్ : రోడ్డు ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన గరువారం పీటీఎం మండలంలో జరిగింది. పోలీసులు తెలిిపిన వివరాలు.. పీటీఎం మండలం, టి.సదుంకు చెందిన ఎం.మధు(19) పని నిమిత్తం బైకులో చెన్నరాయునిపల్లెకు బయలుదేరాడు. చెన్నరాయునిపల్లె క్రాస్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనానికి సైడు ఇవ్వబోయి బైకు అదుపు తప్పి పడిపోయాడు. స్థానికుల సాయంతో మధును కుటుంబీకులు చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.
వివాహిత ఆత్మహత్య
రాజంపేట : మండలంలోని బోయనపల్లెలో గురువారం రైల్వేలోకోఫైలెట్ శ్రీరాంశ్రీనివాసులు భార్య కృష్ణవేణి ఆత్మహత్య చేసుకుంది. మన్నూరు పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకున్నారు. మృతదేహంను పోస్టుమార్టరం నిమిత్తం రాజంపేట ప్రాంతీయవైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణవేణి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.


