వంటింట్లో గ్యాస్‌ మంట! | - | Sakshi
Sakshi News home page

వంటింట్లో గ్యాస్‌ మంట!

Mar 13 2026 7:53 AM | Updated on Mar 13 2026 7:53 AM

కడప సెవెన్‌రోడ్స్‌/బద్వేలు : అంతర్జాతీయ పరిణామాల సాకుతో కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ ధరలను పెంచుతూ తీసుకున్న నిర్ణయం సామాన్యుడి పాలిట గుదిబండగా మారింది. ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న నిత్యావసర ధరలతో సతమతమవుతున్న సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఈ ’వంటగ్యాస్‌ పెంపు’ పిడుగుపాటులా తగిలింది. పశ్చిమాసియాలో ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మరియు అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడమే కాకుండా, ఇక్కడ సామాన్యుడి వంటింటి బడ్జెట్‌ను అస్తవ్యస్తం చేశాయి.

భారీగా పెరిగిన ధరలు : తాజా నిర్ణయంతో గృహ వినియోగ సిలిండర్‌పై రూ. 60 పెరగగా, వాణిజ్య (కమర్షియల్‌) కనెక్షన్లపై ఏకంగా రూ. 114 మేర భారం పెరిగింది. ఏడాది కాలంలోనే ఇలా ధరలు పెరగడం ఇది రెండోసారి కావడంతో ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది.

వైఎస్‌ఆర్‌ జిల్లాపై ప్రభావం

వైఎస్‌ఆర్‌ జిల్లాలో మొత్తం 5,99,865 గృహ గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. తాజా పెంపుతో కేవలం ఈ జిల్లాలోని వినియోగదారులపైనే నెలకు సుమారు రూ. 3.59 కోట్ల అదనపు భారం పడనుంది. ఏడాదికి లెక్కగడితే ఇది రూ. 43 కోట్లకు పైగానే ఉండటం గమనార్హం.

కుదేలవుతున్న హోటల్‌ రంగం

వాణిజ్య సిలిండర్‌ ధర రూ. 114 పెరగడంతో హోటల్‌ మరియు రెస్టారెంట్‌ యజమానులు ఆందోళన చెందుతున్నారు. పప్పులు, నూనెలు, కూరగాయల ధరలు ఇప్పటికే పెరిగి ఉండటంతో, ఇప్పుడు గ్యాస్‌ భారం కూడా తోడవ్వడంతో తినుబండారాల ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. ఇది పరోక్షంగా బయట తినే సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతోంది.

భారం తగ్గించండి..

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గుల నెపం సామాన్యుడిపై నెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పన్నుల తగ్గింపు ద్వారానైనా ఈ భారాన్ని తగ్గించాలని కోరుతున్నారు.

● గ్యాస్‌ ధరల పెంపు హోటల్‌ రంగంపై కోలుకోలేని దెబ్బ తీస్తోంది.ఈవిషయమై ఏపీ స్టేట్‌ హోటల్స్‌ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రటరీ టంగుటూరి చంద్రశేఖర్‌ ఆవేదన వ్యక్తం చేస్తూ.. ‘కరెంటు, కార్మికుల వేతనాలు, అద్దెలు భారంగా మారాయి. ఇప్పుడు గ్యాస్‌ ధరల పెంపుతో నార్త్‌ ఇండియన్‌ ఫుడ్‌, టిఫెన్‌ ఐటమ్స్‌ తయారీ కష్టతరమవుతుంది. టర్నోవర్‌ తగ్గి నష్టాలు వస్తే హోటళ్లు మూతపడే అవకాశం ఉంది, ఇది ఎంతోమంది ఉపాధిని దెబ్బతీస్తుంది‘ అని పేర్కొన్నారు.

● గ్యాస్‌ కొరత వల్ల వేలాది హోటళ్లు మూతపడే పరిస్థితి ఉంది. కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. ప్రభుత్వం వెంటనే గ్యాస్‌ సరఫరాను పునరుద్ధరించాలి లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. అందరికీ గ్యాస్‌ అందేలా ’జంబ్లింగ్‌ పద్ధతి’ (రోజు విడిచి రోజు సరఫరా) అమలు చేయాలని కడప హోటల్‌ అసోసియేషన్‌ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

గ్యాస్‌ సరఫరాపై ఆందోళన వద్దు : జేసీ

ఇరాన్‌–ఇజ్రాయిల్‌ యుద్ద నేపధ్యంలో గ్యాస్‌ సరఫరాపై సామాజిక మాధ్యమాల్లో సాగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ నిధి మీనా అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో పౌరసరఫరాల అధికారులు, గ్యాస్‌ ఏజెన్సీ డీలర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె ఈ అంశాలను సమీక్షించారు. జిల్లాలో ఎల్‌పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని, సరఫరా యధావిధిగా కొనసాగుతుందన్నారు. సింగిల్‌ సిలిండర్‌ వారు 25 రోజులకు, డబల్‌ సిలిండర్‌ వారు 30 రోజులకు ఒకసారి మాత్రమే బుకింగ్‌ చేసుకోవాలని తెలిపారు. ఇంటి అవసరాలకు వాడే సిలిండర్లను కమర్షియల్‌ అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనవసరంగా గ్యాస్‌ను నిల్వ చేసి కొరత సృష్టించవద్దని హెచ్చరించారు.

అష్టకష్టాలు

వంట గ్యాస్‌ సిలిండర్‌ కోసం

తీవ్ర ఇబ్బందులు

సింగిల్‌ సిలిండర్‌ బుకింగ్‌ గడువు

25 రోజులకు పెంపు

డబల్‌ సిలిండర్‌ కోసం 30 రోజులు ఆగాల్సిన స్థితి

బుకింగ్‌కు కాల్‌ చేసినా స్వీకరించని వైనం

హోటళ్లు, రెస్టారెంట్లకు గ్యాస్‌ బంద్‌

చిరు వ్యాపారుల ఉపాధిపై పెద్ద దెబ్బ

రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి

యుద్ధాన్ని అడ్డం పెట్టుకుని కేంద్రం పెంచిన ఈ ధరల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, కేంద్రం ధరలు పెంచుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. పెంచిన ధరలను తగ్గించకపోతే ప్రజల ఆగ్రహం తప్పదు. – ఎ. రాజేశ్వరిరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

గ్యాస్‌ను మర్చిపోవాల్సిందే

కూలి పనులు చేసుకుని బతికే మాకు మాటిమాటికీ ధరలు పెరిగితే చాలా కష్టం. ఇప్పటికే ధరలు భరించలేక కట్టెల పొయ్యిపై వండుకుంటున్నాం. ధరలు తగ్గించకపోతే పేదవాళ్లు గ్యాస్‌ సిలిండర్‌ను పూర్తిగా మర్చిపోవాల్సిందే. ప్రభుత్వం పేదల పక్షాన నిలబడాలి. – దేవి, గృహిణి, బద్వేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement