మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ హుళక్కి
ఐఆర్ లేదు.. పీఆర్సీ లేదు.. 5 డీఏలు పెండింగ్
ఉద్యోగులకు మొత్తం రూ.40 వేల కోట్ల బకాయి
సర్వీస్ టీచర్లకు టెట్ నిబంధన తప్పు
సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిరుద్యోగులు, మహిళలు, రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన సీఎం చంద్రబాబు.. ఉద్యోగులకూ వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చారు. ‘ఉద్యోగులను చంద్రబాబు చాలా దారుణంగా మోసం చేశారు. అధికారంలోకి రాగానే మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఉన్న పీఆర్సీ రద్దు చేశారు. కొత్త పీఆర్సీ వేయలేదు. 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి.
ఉద్యోగులకు వివిధ రూపాల్లో ప్రభుత్వం దాదాపు రూ.40 వేల కోట్ల బాకీ ఉంది. సీపీఎస్ రద్దు చేస్తానన్న హామీ కూడా నెరవేర్చలేదు. అదే గత మా ప్రభుత్వం గ్యారెంటీ పెన్షన్ పథకం (జీపీఎస్) అమలు చేసి ఉద్యోగులకు మేలు చేసింది. కాగా, ఉద్యోగులకు అన్ని రకాలుగా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబునాయుడు’ అంటూ ఓ ప్రశ్నకు వైఎస్ జగన్ జవాబిచ్చారు. ద్రవ్యోల్బణం ఒక మిథ్య అన్న సీఎం చంద్రబాబు ఐక్యూ ఎలా ఉందనేది అందరికీ తెలుస్తోందంటూ వైఎస్ జగన్ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
సర్వీస్ టీచర్లకు టెట్ నిబంధన తప్పు..
‘సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్ష నిర్ణయం తప్పు. టీచర్లు వారి సమస్యల కోసం మా పార్టీ ఎంపీలతో కలిసి, కేంద్రంలో విజ్ఞాపన పత్రం ఇస్తే, వారిని సస్పెండ్ చేశారు. అది హేయమైన చర్య. ఇంకా 20 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్న టీచర్లను ఇప్పుడు టెట్ రాయమనడం ఎంత వరకు సబబు?. వారు ఇంతకాలం ఒకే సబ్జెక్ట్ బోధిస్తున్నారు.
టెట్‌లో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. వారు అవన్నీ పాస్ కావడం కష్టం. నాడు వారు ఎంపికైనప్పుడు టెట్ లేదు. ఇప్పుడు రాయాలంటే ఎలా?. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించాలి. వారి నిర్ణయాన్ని ఎండగట్టి, చట్ట సవరణ కూడా చేయించాలి. దాని ఆధారంగా కోర్టులో పోరాడాలి. అంతేకానీ, ఆ పని చేయకుండా, మా ఎంపీలతో కలిసి ఢిల్లీ వెళ్లిన టీచర్లను సస్పెండ్ చేయడం అత్యంత దారుణం. ఉద్యోగులను మోసం చేసిన సీఎం చంద్రబాబు.. ప్రశ్నిస్తే వేధిస్తూ వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారంటూ మరో ప్రశ్నకు సమాధానంగా వైఎస్ జగన్ చెప్పారు.
డీఎస్సీపై కోర్టుకు వెళ్లాం.. కేంద్రానికి నివేదించాం..
డీఎస్సీపై సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధపడడం లేదు కదా.. మీరే అన్ని వివరాలతో సీబీఐకి ఏమన్నా లేఖ రాసే అవకాశం ఉందా అని విలేకరులు అడగ్గా.. దీనిపై ఇప్పటికే హైకోర్టులో కేసు వేశాం. విచారణ జరుగుతోంది. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రధానమంత్రికి లేఖ కూడా రాశాం. మా పార్టీ ఎంపీలు కేంద్ర హోం మంత్రిని కలిసి డీఎస్సీ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. అబ్బాకొడుకులకు దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించాల్సిందిగా కేంద్రానికి లేఖ రాయాలని మరోసారి చాలెంజ్ విసిరారు.


