కరువు కరాళ నృత్యం | Drought Weather Conditions in Satyasai District: Andhra pradesh | Sakshi
Sakshi News home page

కరువు కరాళ నృత్యం

Aug 21 2026 5:09 AM | Updated on Aug 21 2026 5:09 AM

Drought Weather Conditions in Satyasai District: Andhra pradesh

చిగతుర్పిలో రైతు మల్లేశ్‌ వక్క తోట పూర్తిగా ఎండిపోయిన దృశ్యం

శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా తీవ్రమవుతున్న కరువు పరిస్థితులు 

ఒట్టిపోయిన బోర్లు .. కళావిహీనంగా చెరువులు, కుంటలు 

మడకశిరలో ఎండుతున్న వక్క, దానిమ్మ ఇతర పంటలు 

తాగునీటి కోసం రోజూ ఏదో ఒకచోట ప్రజల నిరసనలు 

పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం 

దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు

మడకశిర: శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా కరువు కరాళ నృత్యం చేస్తోంది. ప్రధానంగా జిల్లాలోని కర్ణాటక సరిహద్దు నియోజకవర్గాలపై అధిక ప్రభావం చూపనుంది. ఇప్పటికే మడకశిర నియోజకవర్గంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎల్‌నినో ప్రభావం జిల్లాలోని ఇతర నియోజకవర్గాల కన్నా  మడకశిర నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పడింది. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో చెరువుల్లోకి నీరు చేర లేదు, వంకలు, వాగులు ప్రవహించలేదు. కుంటలు, చెక్‌డ్యాంలు నిండలేదు. దీంతో భూగర్భజల మట్టం ప్రమాదస్థాయికి పడిపోయింది. బోరు బావులు ఎండిపో­తుండటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 

ఎండుముఖం పట్టిన వేరుశనగ 
నియోజకవర్గంలో మడకశిర, అమరాపురం, గుడిబండ, రొళ్ల, అగళి మండలాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 23,973 హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశనగ సాధారణ సాగు కావాలి. అయితే వర్షాలు లేకపోవడంతో సాగానికి సగం సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. దాదాపు 12 వేల హెక్టార్ల విస్తీర్ణంలో రైతులు వేరుశనగ సాగు చేసినా... పంట ఎండిపోతోంది. ప్రస్తుతం వర్షం వచ్చినా ఫలితం లేకుండా పోయింది. పెట్టుబడంతా మట్టి పాలైందని రైతులు వాపోతున్నారు. 

తాగునీటికి కష్టాలు 
నియోజకవర్గంలో తాగునీటి సమస్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే దాదాపు 50 గ్రామాల ప్రజలు తాగునీటి సమస్యతో నానా కష్టాలు పడుతున్నారు. వందలాది తాగునీటి బోర్లు ఎండిపోయాయి. కొత్త బోర్లు తవ్వించినా నీరు లభ్యం కావడం లేదు. నీటి కోసం ప్రజలు రోజూ ఏదో ఒక చోట చేస్తున్న నిరసనలే తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. వర్షాభావం ఇలాగే కొనసాగితే ట్యాంకర్లకు కూడా నీరు దొరకడం కష్టంగా మారే పరిస్థితి ఉంది. 

కళావిహీనంగా వక్క తోటలు 
మడకశిర నియోజకవర్గం పండ్ల తోటలకు పెట్టింది పేరు. వక్క, దానిమ్మ తోటలు అధికంగా ఉన్నాయి. వర్షాలు లేకపోవ­డంతో ఇప్పటికే వందలాది వ్యవసాయ బోరు బావులు ఎండిపోయాయి. వక్క, దానిమ్మ తోటలను కాపాడుకోవడం రైతులకు భారంగా మారింది. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే వక్క, దానిమ్మ తోటలు ఎండిపోయాయి. 

నిద్రమత్తులో చంద్రబాబు ప్రభుత్వం 
జిల్లా వ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్నా      చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రలో ఉంది. కరువు నివారణకు కనీస జాగ్రత్తలు తీసుకోలేదని అన్నదాతలు మండిపడుతున్నారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు కూడా ముంచుకొస్తున్న కరువును పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉచిత పంటల బీమా, నష్ట పరిహారం, ఉచితంగా ఎరువులు, మందులు, విత్తనాల పంపిణీ, ఉచిత బోర్ల పథకం, రుణాలమాఫీ లాంటి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కూడా కరువు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు.

చెరువులన్నీ ఖాళీ 
మడకశిర నియోజకవర్గంలో మైనర్‌ ఇరిగేషన్‌ చెరు­వులు 47 ఉన్నాయి. 40 చెరువుల్లో నీరు లేదు. ఆరేడు చెరువుల్లో మాత్రమే కొద్దిపాటి  నీళ్లున్నాయి. దీంతో దాదాపు 17 వేల ఎకరాల ఆయకట్టు భూములన్నీ బీడుగా మారే ప్రమాదం ఏర్పడింది. అదే విధంగా పంచాయతీరాజ్‌ చెరువులు కూడా ఎండిపోయాయి.  

ప్రభుత్వం ఆదుకోవాలి 
వర్షాభావంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. చెరువుల్లో చుక్కనీరు లేదు. మడకశిర ప్రాంతంలో కరువు పరిస్థితి స్పష్టంగా కనబడుతోంది. వివిధ రకాల తోటలు, పంటలు ఎండిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని మడకశిరను కరువు ప్రాంతంగా ప్రకటించాలి. రైతులను ఉదారంగా ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలి. లేకపోతే రైతులు వలస బాట పట్టడం ఖాయ
.  – బసవరాజు, రైతు, రొళ్ల  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement