నిందితుడు సంజుష్ , భారతి ముఖి (ఫైల్)
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ఇనార్బిట్ మాల్ వద్ద 16న ఘోర ప్రమాదం
లగ్జరీ స్పోర్ట్స్ కారుతో దూసుకొచ్చిన జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్
రోడ్డు దాటుతున్న యువతిని అతి వేగంగా ఢీకొన్న సంజుష్
లైఫ్‌స్టైల్ స్టోర్ ఉద్యోగిని భారతి ముఖి దుర్మరణం
సంజుష్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు
పోలీసులు నోటీసులిచ్చి వదిలేయడంపై అనుమానాలు
మాదాపూర్ (హైదరాబాద్): జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్ హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో లగ్జరీ స్పోర్ట్స్ కారుతో అతి వేగంతో దూసుకొచ్చి ఓ యువతిని బలిగొన్నాడు. అత్యంత రద్దీగా ఉండే ఐటీ కారిడార్‌లోని ఇనార్బిట్ మాల్ వద్ద ఈ నెల 16న మధ్యాహ్నం జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో లైఫ్‌స్టైల్ స్టోర్ ఉద్యోగిని భారతి ముఖి (26) దుర్మరణం చెందింది. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన రాజ్యసభ సభ్యుడు, జనసేన పార్టీ నేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజుష్ (23) ఈ ఘోర ప్రమాదానికి కారణమైనట్లు తేలింది. దీంతో సంజుష్‌పై మాదాపూర్ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.
జీబ్రా క్రాసింగ్‌పై రోడ్డు దాటుతుండగా..
ఇనార్బిట్ మాల్‌లోని లైఫ్‌స్టైల్ స్టోర్‌లో పని చేసే భారతి ముఖి తన సహోద్యోగి పూజా అశోక్ అలోన్‌తో కలిసి ఈ నెల 16న మధ్యాహ్నం ఐటీసీ కోహినూర్ సమీపంలో భోజనం చేయడానికి వెళ్లింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో వారిద్దరూ తిరిగి వస్తూ ఇనార్బిట్ మాల్‌లోకి వచ్చేందుకు జీబ్రా లైన్‌పై రోడ్డు దాటుతుండగా టీజీ 09
జీ 0666 నంబరు ఆస్టన్ మార్టిన్ స్పోర్ట్స్ కారు అత్యంత వేగంగా దూసుకొచ్చి భారతి ముఖిని బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి ఆమె గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడింది. ఆమె తల, శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఆస్పత్రికి వచ్చిన ఎంపీ లింగమనేని రమేష్ కొడుకు లింగమనేని సంజుష్ అక్కడి నుంచి జారుకున్నట్లు చెబుతున్నారు. లైఫ్‌స్టైల్ స్టోర్ మేనేజర్ పంజాల అశ్విన్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంజుష్ కారును నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా నడిపి మరణానికి కారణమైనట్లు తేల్చి, అతనిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 106(1)కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సంజుష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ టెస్ట్‌లు చేయగా నెగెటివ్ వచ్చిందని, అందువల్ల నోటీసులు ఇచ్చి వదిలేశామని పోలీసులు చెబుతున్నారు.
ఐటీ కారిడార్‌లో వాహనాలు గంటకు 40 కిలోమీటర్లు, కేబుల్ బ్రిడ్జిపై 30 కిలోమీటర్లకు మించి వేగంతో వెళ్లకూడదని నిబంధనలు ఉన్నాయి. మధ్యాహ్నం సమయంలో రద్దీగా ఉండే ఐటీ కారిడార్‌లో మితిమీరిన వేగంతో వెళ్లడం నిందితుడి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అయినప్పటికీ, అతి వేగంగా కారు నడిపి ఓ యువతి మృతికి కారణమైన సంజుష్‌కు కేవలం నోటీసులు ఇచ్చి వదిలివేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సామాన్యులు అతి వేగంగా రోడ్డు ప్రమాదానికి కారణమైతే ఇలానే వ్యవహరిస్తారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.


